పెగడపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్ ఇనుగండ్ల కరుణాకర్‌రెడ్డి, సహకరించిన ఉప సర్పంచ్ పెద్ది సంతోష్, జీపీ కార్యదర్శి తిరుపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో స్పెయిన్‌కు చెందిన మొనాస్ యూనిడాస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గ్రామంలో 4 హ్యాండ్పంపులు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గత ఏప్రిల్‌లో కార్యదర్శి సాయంతో జీపీ తీర్మానం చేయించుకొని సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి రూ.3.10లక్షలు డ్రా చేసుకు న్నారు.
అదే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో రామాలయం ముందు, అనుబంధ గ్రామమైన గొల్లపల్లిలో హైమాస్ట్ లైట్స్, హనుమాన్‌గుట్టకు వెళ్లే రోడ్డు నిర్మాణం.. తదితరాలపై అక్రమంగా ఎంబీ రికార్డు తయారు చేసి ఆ బిల్లులూ డ్రా చేశారు. వీటిపై గ్రామానికి చెందిన పవన్‌రెడ్డి అనే యువకుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా పీఆర్అధికారులు విచారణ చేసి నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు. దీంతో సర్పంచ్‌తోపాటు తీర్మానాన్ని సర్టిఫై చేసిన కార్యదర్శి తిరుపతిని, సహకరించిన ఉపసర్పంచ్‌ని కలెక్టర్సస్పెండ్చేశారు.