యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ శోభన్ బాబుపై వేటు పడింది. ఈమేరకు శుక్రవారం సీసీఎల్ఏ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టా పాస్ బుక్ కోసం యాదగిరిగుట్ట ఆఫీసుకు వెళ్లిన రైతును తహసీల్దార్ శోభన్ బాబు ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో రూ.5 వేలు లంచం డిమాండ్ చేసిన వీడియో ఈనెల 15న బయటకు రావడం, పలు పత్రికలు, చానల్స్‌లో కథనాలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీడియో ఆధారంగా విచారణ చేసిన భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి ప్రభుత్వానికి రిపోర్టు అందించారు. దీని ఆధారంగా శోభన్ బాబును విధుల నుంచి తప్పిస్తూ సీసీఎల్ఏ సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేశారు.
సిబ్బందిపై ఆర్డీవో ఫైర్
యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చిన ఆర్డీవో భూపాల్ రెడ్డి వచ్చి రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వార్నింగ్ ఇచ్చారు.