- 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్
- తొలి జాబితాలో బీసీలకు 20కిపైగా సీట్లు
- పొత్తులో భాగంగా జన సేనకు 10–12 స్థానాలు
- బీసీని సీఎం చేయనున్నట్టు ప్రకటించే చాన్స్
- మరి కాసేపట్లో తొలి జాబితా విడుదల!
ఢిల్లీ: ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. గోషామహల్ టికెట్ ను కూడా ఆయనకే కేటాయించనుందని సమాచారం. 55 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ దాదాపుగా సిద్ధమైందని సమాచారం. మరి కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ విడుల చేసే అవకాశం ఉంది. టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్ లో బీసీలకు 20 సీట్లు కేటాయించనున్నారు. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిన్న రాత్రి జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ముగ్గురు అభ్యర్థులను స్క్రీనింగ్ చేసిన కమిటి ఆ జాబితాను పార్లమెంటరీ బోర్డుకు పంపింది. దానిపై రాష్ట్ర నాయకులతో చర్చించిన పార్లమెంటరీ బోర్డు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనకు పొత్తులో భాగంగా -10 నుంచి 12 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన జనసేన బీజేపీ అధిష్టానాన్ని 20 సీట్లు అడిగింది. వీటిపై చర్చించిన అధినాయకత్వం 10 –12 స్థానాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేన ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. వీటిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందింస్తుందనేది ఉత్కంఠగా మారింది. జనసేనకు ఏయే సీట్లు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది.
అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం: డాక్టర్ కే లక్ష్మణ్
బీజేపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు చర్చించిందని చెప్పారు. టికెట్ల కేటాయింపులో బీజేపీ సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించామని చెప్పారు. ఏక్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. మహిళల సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో కవిత ధర్నాలు చేసింది కానీ మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలను వాడుకొని వదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు,బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు.