సస్పెన్షన్లు.. షోకాజ్లు..మార్నింగ్ 8.50కే డాక్టర్లతో గూగూల్ మీట్​

సస్పెన్షన్లు.. షోకాజ్లు..మార్నింగ్ 8.50కే డాక్టర్లతో గూగూల్ మీట్​
  • కొరడా ఝలిపిస్తున్న యాదాద్రి కలెక్టర్ 
  • బడులు.. హాస్పిటల్స్..  హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు 
  • నిర్లక్ష్యంపై సీరియస్ 
  • తాజాగా నలుగురు అంగన్ వాడీ టీచర్లు సస్పెండ్

యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు పాలనలో తనదంటూ ముద్ర వేసుకున్నారు. కలెక్టర్​గా వచ్చిన వెంటనే పాలనను గాడిలో పెట్టే పనిలో ముందుకు సాగుతున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి షోకాజ్​ నోటీసులు ఇవ్వడం.. సీరియస్​ ఇష్యూ అయితే సస్పెండ్​ చేస్తున్నారు. తాజాగా నలుగురు అంగన్వాడీ టీచర్స్​ను సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 8.50కే డ్యూటీ డాక్టర్లతో గూగుల్​ మీట్​లో మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ రివ్యూ చేస్తారో..? ఎవరిపై వేటు పడుతోందనని అధికారులు అలెర్ట్​గా పని చేస్తున్నారు. 

హైదరాబాద్​కు యాదాద్రి జిల్లా సమీపంలో ఉంది. అందుకే కొందరు తప్ప చాలా మంది హెచ్​వోడీలు మొదలుకొని క్లర్క్​ వరకూ అప్​ అండ్​ డౌన్​ చేయడం అలవాటుగా మారడంతో సమయపాలన లేకుండా పోయింది. విధుల నిర్వహణలో ఎంప్లాయీస్​ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. కలెక్టర్​గా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ఈ అంశంపైనే దృష్టి సారించారు. నిత్యం రివ్యూలు చేయడంతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం డిపార్ట్​మెంట్​లపై ఆయన ప్రధానంగా ఫోకస్​ పెట్టారు. 

  ఆకస్మిక తనిఖీలు 

జిల్లా వ్యాప్తంగా కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆఫీసు నుంచి బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నది ఎవరికీ  తెలియడం లేదు.  వెహికల్​ రోడ్డుపైకి వచ్చిన తర్వాతే ఏవైపు వెళ్లాలో చెబుతున్నారు.  రెండు రోజుల క్రితం కలెక్టరేట్​కు కూతవేటు దూరంలో ఉన్న రాయగిరి  హైస్కూల్​ను మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మికంగా విజిట్​ చేశారు. వంటలు స్టూడెంట్స్​కు సరిపోని విధంగా ఉండడంతో హెచ్​ఎం  సహా మరో ఇద్దరికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు వరుసగా రెండు రోజులు ఒకే రెసిడెన్షియల్​ స్కూల్​కు వెళ్లి.. కేర్​ టేకర్​ను సస్పెండ్​ చేయడంతోపాటు ప్రిన్సిపాల్​కు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు.

సంస్థాన్​ నారాయణపురంలోని ఎస్సీ హాస్టల్​లో రాత్రి నిద్ర కూడా చేశారు. సర్వేల్​ గురుకులంలోని ఓ స్టూడెంట్​పై జావా పడడంతో గాయాలయ్యాయి. దీంతో ప్రిన్సిపాల్​ను సస్పెండ్​ చేశారు. జిల్లాసుపత్రిలో ల్యాబ్​ టెక్నిషియన్​ను సస్పెండ్​ చేశారు. రామన్నపేట సీహెచ్​సీకి వెళ్లి దీర్ఘాకాలికంగా సెలవులో ఉన్న డాక్టర్​ను విధుల నుంచి తొలగించే విధంగా ఆర్డర్స్​ రెడీ చేయాలని ఆదేశించారు. హెల్త్​ స్టాఫ్​లో 60 శాతం మందికి సెలవులు ఇచ్చిన సూపరింటెండెంట్​కు షోకాజ్​ నోటీసు ఇచ్చారు. ప్రజావాణికి హెచ్​వోడీలు అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. రాకుండా కింది స్టాఫ్​ను పంపిన వారికి ఫోన్​ చేసి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. 

 అంగన్వాడీలు సస్పెండ్​ 

బాలామృతం పక్కదారి పడ్తున్న విషయంలో సీరియస్​ అయిన కలెక్టర్​ నలుగురు అంగన్వాడీ టీచర్లను మంగళవారం రాత్రి సస్పెండ్​  చేశారు. ఎస్వోటీ పోలీసులు ఇటీవల భువనగిరిలోని ఓ పశువుల షెడ్​లో 150 కిలోల బాలమృతం పట్టుకున్నారు.విచారణలో ఆలేరు ప్రాజెక్ట్​ పరిధిలోని మంతపురి, పుట్టగూడెం, యాదగిరిగుట్ట 3వ సెంటర్​, మోత్కూరులోని 7వ సెంటర్లకు సంబంధించినవిగా తేలింది. దీంతో ఆయన సెంటర్లకు చెందిన అంగన్వాడీ టీచర్లను సస్పెండ్​ చేశారు. 

డాక్టర్లతో 8.50కి గూగుల్​ మీట్​

హాస్పిటల్స్​లో విధులకు డాక్టర్లు డుమ్మా కొడ్తుండడం, ఆలస్యంగా వస్తున్న విషయం దృష్టికి రావడంతో ఓపీకి ముందే కచ్చితంగా హాస్పిటల్​లో ఉండాలని ఆర్డర్స్​ జారీ చేశారు. సరైన సమయానికి వస్తున్నారా..? లేదా..? అన్నది తెలుసుకోవడానికి గూగుల్ మీట్​ నిర్వహిస్తున్నారు. ఈ మీట్​లో డ్యూటీలో ఉన్న ప్రతి డాక్టర్​ పాల్గొనాలని ఆదేశించారు.

ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్​తో మాట్లాడుతూనే ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న పేషెంట్​తో మాట్లాడించాలని వారికి సూచిస్తున్నారు. ఈ పరిణామంతో డాక్టర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకే హాస్పిటల్​కు చేరుకుంటున్నారు. ట్రీట్​మెంట్​ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలతో అన్ని డిపార్ట్​మెంట్ల స్టాఫ్​ అలర్ట్​గా ఉంటున్నారు.