రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (నవంబర్ 11న) తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి పూట ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్దకు వచ్చి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ప్రమాదానికి సదరు యువకుడికి ఏమైనా సంబంధం ఉందా..? లేదా..? అనే కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ ఆ యువకుడికి ఈ ప్రమాదానికి సంబంధం లేకపోతే... ఘటనాస్థలానికి ఎందుకు వెళ్లినట్లు..? అక్కడ ఆయనకు ఏం పని..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా..? లేక షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందా..? అనే కోణాల్లో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు.
ఏం జరిగింది..?
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (నవంబర్ 11) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ వద్ద ఉన్న క్రాకర్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. పక్కనే అనుకుని ఉన్న ఓ ఫుడ్ కోర్టుకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు వ్యాపించిన ఫుడ్ కోర్టులో సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక చాలా సేపు ఆందోళనకు గురయ్యారు.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే వెంటనే ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావించారు. ఈ ప్రమాదంపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అనుమతులు లేకుండా క్రాకర్స్ దుకాణం ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది.