పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది? ..అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్ మృతి     

పెద్దాపూర్ గురుకులంలో ఏం జరుగుతోంది? ..అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్ మృతి     
  • అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్ మృతి     
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • 12 రోజుల్లోనే ఇద్దరు విద్యార్థుల కన్నుమూత 
  • దవాఖానలో చేరి ఈ మధ్యే డిశ్చార్జి అయి వచ్చిన మరో ఇద్దరు  
  • అందరికీ పాము కాటుకు ఇచ్చే ‘యాంటీ వీనం’ ట్రీట్​మెంటే! 
  • అసలు కారణాలను అన్వేషిస్తున్న ఆఫీసర్లు

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా పెద్దాపూర్​ గురుకులంలో చదువుతున్న ఓ స్టూడెంట్ అనుమానాస్పదంగా చనిపోవడం, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్​లో అడ్మిట్ కావడం కలకలం సృష్టించింది. 12 రోజుల కింద కూడా ఇలాగే ఒక స్టూడెంట్​చనిపోగా, మరో ఇద్దరు దవాఖానలో చేరి ఈ మధ్యే డిశ్చార్జి అయి వచ్చారు. ఈ ఘటనలన్నింటికీ పాము కాటే కారణమని స్టూడెంట్లు, పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, అసలు ఏమైందో తెలుసుకోవడానికి పోలీసులు, అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పిల్లలు ఇంకా హాస్టల్​లో ఉంటే వారికి ఏమవుతుందోనని  పేరెంట్స్​ ఇండ్లకు తీసుకువెళ్తున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా వినడం లేదు. పెద్దపూర్ గురుకులంలో సుమారు 460 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇందులో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనిరుధ్ (12), మెట్​పల్లి  మండలం ఆత్మకూర్​కు  చెందిన అల్లి మోక్షిత్ (12), మల్యాల మండలం తాటిపల్లికి చెందిన హేమంత్ యాదవ్ (12) ఆరో తరగతి చదువుతున్నారు. అనిరుధ్, మోక్షిత్ 6ఏ సెక్షన్ కాగా, హేమంత్ యాదవ్ 6 బీ సెక్షన్. వీరికి క్లాసులు, డార్మిటరీ ఒకే రూములో నిర్వహిస్తున్నారు. 

కడుపు నొప్పి అంటూ ఏడుస్తూ... 

గురువారం రాత్రి 10 గంటల నుంచి అనిరుధ్ రూములో ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమైందని తోటి విద్యార్థులు అడిగితే కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. రాత్రి12 గంటల టైంలో ఆకలేస్తుందని చెప్పగా,  విద్యార్థులు దానిమ్మ తినిపించారు. అయినా ఏడుస్తూనే పడుకున్నాడు. తెల్లవారుజామున పీఈటీ నిద్రలేపడానికి రాగా అనిరుధ్ లేవలేదు. దీంతో 108 అంబులెన్స్​లో  కోరుట్ల దవాఖానకు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని జగిత్యాల తరలిస్తుండగా చనిపోయాడు. 

రెండు గంటల తర్వాత మరొకరు...

అనిరుధ్ ​చనిపోయిన రెండు గంటలకే అల్లి మోక్షిత్ (12) కడుపునొప్పి అంటూ ఏడుస్తూ హాస్టల్​బయట కూర్చున్నాడు. టీచర్లు మోక్షిత్​ను మెట్​పల్లిలోని  ప్రైవేటు హాస్పిటల్​కు, అక్కడి నుంచి నిజామాబాద్ దవాఖానకు తరలించారు. 

ప్రార్థన టైంలో మరొకరు...

ఉదయం 9 గంటలకు స్కూల్​లో నిర్వహించిన ప్రేయర్​లో పాల్గొన్న హేమంత్ యాదవ్ (12) అక్కడే కుప్పకూలాడు. సిబ్బంది మెట్ పల్లి సర్కారు హాస్పిటల్ కు, అక్కడి నుంచి నిజామాబాద్ తరలించారు. 

గత నెల 26న కూడా ఇలాగే...

గత నెల26న ఇదే స్కూల్​ హాస్టల్​లో ఆరపేటకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఘనాదిత్య చనిపోయాడు. అంతకుముందు రోజు రాత్రి జ్వరంగా ఉందని తోటి విద్యార్థులకు చెప్పాడు. వాంతులు చేసుకుని పడుకున్నాడు. తెల్లవారి పీఈటీ వచ్చి లేపగా లేవలేదు. దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఉదయం ఆరు గంటలకు మరో ఇద్దరు ఎనిమిదో తరగతి విద్యార్థులకు తీవ్ర జ్వరంతో శరీరంపై దద్దులు వచ్చాయి. కండ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో మెట్​పల్లి సివిల్​ హాస్పిటల్, నిజామామాద్,  తర్వాత హైదరాబాద్ ​నిమ్స్​కు తరలించారు. వీరు ఇటీవలే డిశ్చార్జి అయి వచ్చారు. వీరికి పాము కరిచిందనే అనుమానంతో మూడు దవాఖానల్లోనూ 
‘యాంటీ వీనం’ ఇచ్చారు.  

పాములా..విష పురుగులా..బాటోలిజమా? 

12  రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం, మరో నలుగురు విద్యార్థులు దవాఖానల్లో చేరడానికి కారణమేమిటో అంతు చిక్కడం లేదు. అయితే కొందరు పాములే కారణమని చెప్తుండగా, మరి కొందరు విష పురుగులంటున్నారు. మరికొందరు మసాలాలు పడకపోవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. హాస్టల్ ​రూమ్స్​కు టాయిలెట్స్​కు సుమారు మూడు వందల మీటర్ల దూరం  ఉంటుంది. వెళ్లేదారి అంతా చెట్లతో నిండి ఉంటుంది. టాయిలెట్స్ ఉన్న ప్లేస్​లో గడ్డి ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజూ పాములు తిరుగుతూ ఉంటాయి. రోజూ రాత్రి 8 గంటలకు పిల్లలు టాయిలెట్స్​కు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో పాములు కాటేసి ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. కట్లపాము కోరలు చిన్నగా ఉండడం వల్ల కాటేసినా తెలియదని, నొప్పి కూడా ఉండదని కొందరు డాక్టర్లు చెప్తున్నారు. బహుశా అదే కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇచ్చిన యాంటీ వీనం కూడా పాము కాటేస్తే ఇచ్చేదే కావడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. దీంతో పాటు బ్లాక్ స్పైడర్, కందిరీగలు, గుమ్మడి పురుగుల్లాంటి విష పురుగుల వల్ల కూడా ముప్పు ఉంటుందని చెప్తున్నారు. కానీ చనిపోయే వరకు వెళ్లదంటున్నారు. ఇక కూరల్లో ఉపయోగించే మసాలాలు పడకపోయినా ఇలా అవుతుందని కొందరు డాక్టర్లంటున్నారు. దీన్నే బాటోలిజం అంటారని చెప్తున్నారు. ఇది శరీరంలోని నరాల వ్యవస్థపై దాడి చేస్తుందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాలు శక్తి కోల్పోవడం, ఆఖరికి చనిపోయే ఛాన్స్​ కూడా ఉంటుందంటున్నారు. నిజంగా పిల్లలకు ఏమైందనేది తేలాలంటే ఫోరెన్సిక్​రిపోర్టు వచ్చే వరకూ ఆగాల్సి ఉంటుందంటున్నారు. 

కలెక్టర్ సీరియస్​

ఘటనపై జగిత్యాల కలెక్టర్​ బి సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన తెలంగాణ 
రెసిడెన్షియల్ స్కూల్స్ జగిత్యాల కన్వీనర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పెద్దాపూర్​ జూనియర్ కాలేజీ ఇన్​చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డికి అడిషనల్ కలెక్టర్ రాంబాబు మెమోలు జారీ చేశారు. 

గాంధీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ​ప్రొఫెసర్​ 

గతంలో ఘనాదిత్య చనిపోయినప్పుడు పోస్ట్​మార్టం చేసి రిపోర్టులో ఫిట్స్​తో చనిపోయాడని తేల్చారు. అయితే, అలాంటి ఘటనే మళ్లీ పునరావృతం కావడంతో ఈసారి అధికారులు గాంధీ దవాఖాన నుంచి ఫోరెన్సిక్ ​ప్రొఫెసర్​ను పిలిపించారు. జగిత్యాల మార్చురీలో జిల్లా వైద్యాధికారుల సమక్షంలో పోస్ట్​మార్టం నిర్వహించారు. ప్రొఫెసర్​ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే అసలు ఏం జరిగింది అనేది తెలియనుంది.