కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం అంతర్ని గ్రామంలో ఐదు రోజుల కింద అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. మహారాష్ట్రకు చెందిన రమేశ్, అనిత దంపతులు ఐదు నెలల కింద అంతర్ని గ్రామానికి వచ్చి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరు కూతురు వర్ష (7) గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకులను చూసేందుకు ఈ నెల 9న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల ఇండ్లలో వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. దీంతో కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే శుక్రవారం సాయంత్రం రమేశ్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న ఓ పెంటకుప్పలో చిన్నారి శరీర భాగం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భైంసా రూరల్ సీఐ నైలు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి చనిపోయింది వర్షగా గుర్తించారు. డ్వాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. చిన్నారి శరీర భాగాలు మాత్రమే దొరకడం, తల కనిపించకపోవడంతో బలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.