- ఈ ఏడాది ఇది ఐదో ఘటన
న్యూఢిల్లీ: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ల అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నలుగురు మన స్టూడెంట్లు చనిపోయారు. తాజాగా భారత సంతతికి చెందిన మరో విద్యార్థి సమీర్ కామత్(23) అనుమానాస్పద రీతిలో మరణించాడు. అమెరికాలోని పర్ద్యూ యూనివర్సిటీలో 2023 లో సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తిచేశాడు.
అదే ఏడాది అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. అనంతరం పర్ద్యూ వర్సిటీలోనే ఉన్నత చదువులు (డాక్టోరల్) కొనసాగిస్తున్నాడు. 2025లో డాక్టోరల్ ప్రోగ్రామ్ పూర్తికానుంది. ఇంతలోనే సమీర్ దుర్మరణం పాలయ్యాడు. సోమవారం సాయంత్రం నేచర్ రిజర్వ్ వద్ద అతడి డెడ్ బాడీ లభించింది.
సమీర్ ది హత్యా, ఆత్మహత్యా అనే విషయంపై ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇదే వర్సిటీకి చెందిన నీల్ ఆచార్య అనే ఇండియన్ స్టూడెంట్ ఇటీవలే హఠాత్తుగా చనిపోయాడు. నీల్ ఆచార్య మరణం కూడా అనుమానాస్పదమేనని పోలీసులు చెప్పారు.