- నిర్మల్ ఎంపీజే స్కూల్లో ఘటన, బంధువుల ఆందోళన
- ప్రిన్సిపాల్, ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్ లో మంగళవారం ఉదయం 9వ తరగతి చదువుతున్న దిలావర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన షేక్ అయాన్(14) అనుమానాస్పదంగా చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. షేక్ అయాన్ బేస్ బాల్ ఆడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని టీచర్లు అంటున్నారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ బంధువులు స్కూల్ కు వచ్చి టీచర్లను నిలదీశారు.
టీచర్ల నిర్లక్ష్యంతోనే అయాన్ చనిపోయాడని ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతలు వారికి మద్దతు పలికి రాస్తారోకోలో పాల్గొన్నారు. అక్కడికి ఆర్డీవో రత్న కల్యాణి, డీఈవో రవీందర్ రెడ్డి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రిన్సిపాల్, సిబ్బందిపై వేటు..
విద్యార్థి మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో స్కూల్ ప్రిన్సిపాల్ సంతోష్ తో పాటు కేర్ టేకర్ రమేశ్, స్టాఫ్ నర్స్ సుజాత, పీఈటీ పెంటన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే షేక్ అయాన్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఎంజేపీ ఘటన వివరాలను కలెక్టర్కు వివరించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.