మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి

చెన్నూర్, వెలుగు:  మైనార్టీ గురుకుల స్కూల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూర్ మండలం భీరెల్లి గ్రామానికి చెందిన మారగొని రవి, స్వరూప దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా.. చిన్న కొడుకు ఆదర్శ్(16) చెన్నూర్ మైనార్టీ గురుకుల స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. 

సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన అతడు తిరిగి బుధవారం ఉదయం 9 గంటలకు బ్యాగు తీసుకొని స్కూల్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి చెన్నూర్ వెళ్లాడు. ఆదర్శ్ రాలేదని సాయంత్రం స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు ఆచూకీ కోసం రాత్రి వాకబు చేశారు. గురువారం చెన్నూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ లో అనుమానాస్పద స్థితిలో ఆదర్శ్ మృతి చెంది ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఎస్ఐ సుబ్బారావు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా.. బుధవారం ఆదర్శ్​తోపాటు మరో విద్యార్థి కూడా ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో కనిపించింది. అంతేకాకుండా తోటి విద్యార్థి ఓ షాప్​లో పురుగుల మందు కొన్నట్లు కూడా స్పష్టమైంది.  ప్రస్తుతం ఆ విద్యార్థి ఆచూకీ తెలియడంలేదు. దీంతో ఆదర్శ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.