
- ఫుడ్ పాయిజన్ కారణంగా చనిపోయినట్లు అనుమానాలు
- అత్తింటివారే చంపి ఉంటారని బంధువుల ఆరోపణ
చందుర్తి, వెలుగు : అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు చనిపోయారు. వీరి మృతికి ఫుడ్ పాయిజనే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. అత్తింటి వారే హత్య చేశారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు రాజేశ్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అతడి భార్య పుష్పలత (35), కొడుకు నిహాల్ (6) రుద్రంగిలో ఉంటున్నారు.
శుక్రవారం రాత్రి తల్లీకొడుకు అస్వస్థతకు గురికావడంతో మొదట కోరుట్ల హాస్పిటల్‌కు అక్కడి నుంచి జగిత్యాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం రాత్రి పుష్పలత చనిపోయింది. నిహాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తరలించగా.. అతడు సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు.
అత్తింటి వారే చంపారని ఆరోపణ
పుష్పలత, నిహాల్ మృతిపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఫుడ్‌లో పాయిజన్ కలిపి హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి అన్న శ్రీనివాస్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. పుష్పలత, నిహాల్ రాత్రి తిన్న రొట్టెలు, కూరల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.
తల్లీకొడుకు మృతి వార్త తెలియడంతో ఆమె బంధువులు, నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో రుద్రంగికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పుష్పలత డెడ్‌బాడీని గ్రామానికి తీసుకురాకుండా తిరిగి వేములవాడకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చందుర్తి సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.