తాడుతో చేతులు కట్టేస్కొని ఉరేసుకున్నడు!?

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్బుగూడెంలో యువకుడి అనుమానాస్పద మృతి
  • పోక్సో కేసులో శిక్ష పడుతుందనే సూసైడ్  చేసుకున్నాడని ఫిర్యాదు  
  • పలు సందేహాలకు తావిస్తున్న మరణం

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోక్సో కేసులో శిక్ష పడుతుందనే భయంతోనే రెండు చేతులను తాడుతో కట్టేసుకుని ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా ఆ నిర్ధారణకే వచ్చారు. కానీ, పోస్ట్​మార్టం రిపోర్ట్ ​వచ్చాకే స్పష్టత వస్తుందని  ఆత్మహత్య, అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన బలగాని సందీప్ (20) అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు వాయిదాల కోసం సందీప్ తరచూ కోర్టుకు హాజరవుతున్నాడు. శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. గురువారం అర్ధరాత్రి రెండున్నర గంటల టైంలో తన  అన్న వెంకన్న ను ఫోన్​ ఇవ్వాలని కోరగా, చార్జింగ్​ లేదని చెప్పి భార్యతో కలిసి బయటకు వెళ్లి పడుకున్నాడు. దీంతో సందీప్​ గుడిసెలోనే అన్నయ్య కూతురితో కలిసి నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకు అన్న కూతురు యమున లేచి చూసే సరికి సందీప్​ ఉరేసుకుని కనిపించాడు. దీంతో తండ్రికి చెప్పగా అతడు వచ్చి చూసేసరికి ఉరితాడుకు వేలాడుతున్న సందీప్​ కనిపించాడు. రెండు చేతులు ముందు వైపు తాడుతో కట్టేసి ఉన్నాయి. అతడి ఫోన్ ​చెక్ ​చేయగా తెల్లవారుజామున 3:11 గంటలకు ఒక సెల్ఫ్​ వాట్సాప్ మెసేజ్​ ఉంది. అందులో ‘అన్నా నాకు 20 ఏండ్ల జైలు శిక్ష పడుతుంది. దానికంటే చనిపోవడమే కరెక్ట్’ అని ఉంది. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన తమ్ముడి మృతిపై అనుమానాలు లేవని వెంకన్న ఫిర్యాదు చేశాడు. ఇన్​చార్జి ఎస్సై రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పరిశీలించారు.  

చేతులు కట్టేసుకుని సూసైడ్​ సాధ్యమా? 

సందీప్​ మృతి చెందిన తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. చేతులను ముందువైపు కట్టేసుకుని ఉరేసుకున్నారని చెబుతుండగా,  అసలు అది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చనిపోవడానికి ధైర్యం చాలకనో,  మధ్యలో వెనక్కి తగ్గవద్దనో నోటితో తాడును చేతులకు చుట్టుకుని ముడేసుకుని ఉంటాడని భావించనా అంత గట్టిగా ముడేసుకోవడం వీలు కాదు. పోస్ట్​మార్టం రిపోర్ట్​ వస్తేనే క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.