భవిష్యత్తు తరాల వారి అవసరాలు తీర్చుకొనే సామర్థ్యం దెబ్బతినకుండా ప్రస్తుత తరాలవారు అవసరాలు తీర్చుకోవడమే సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధిని సాధించడానికి ఆర్థిక వృద్ధి(ఉత్పత్తి, ఉపాధి అందరికీ లభించాలి), సాంఘిక సమ్మిళితం(విద్య, ఆరోగ్యం, పోషకత్వం, సాంఘిక భద్రత ఉండాలి), పర్యావరణ పరిరక్షణ(సురక్షిత మంచినీరు, స్వచ్ఛమైన గాలి, పునరావృత శక్తి వనరులు, మంచి పర్యావరణం అందించాలి) అవసరం. వ్యక్తి, సమాజం, సంక్షేమానికి ఈ మూడింటి అంతర సంబంధం అవసరం.
17 టార్గెట్స్
ప్రపంచం నుంచి దారిద్ర్యం, ఆకలి బాధలను తరిమి వేయాలనే ధ్యేయంతో సహస్రాబ్ధి లక్ష్యాల స్థానంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాను 2015 సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సమావేశం ఆమోదించింది. 2016 జనవరి నుంచి 2030 డిసెంబర్ నాటికి వీటిని సాధించాలని తలపెట్టారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు.
1. ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని రూపుమాపాలి.
2. ఆకలిని అంతమొందించి ఆహార భద్రత, పోషకత్వాన్ని మెరుగుపర్చడం, కొనసాగించదగిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
3. అన్ని వయస్సుల వారికి ఆరోగ్యకర జీవన విధానం ఉండేటట్లు చూడటం
4. అందరికీ సమ్మిళిత, నాణ్యమైన విద్యను జీవితాంతం అభ్యసన అవకాశాలు కల్పించడం
5. లింగ సమానత్వం, బాలబాలికల సాధికారతను సాధించడం
6. నీరు, పారిశుద్ధ్య నిర్వహణ సుస్థిరంగా ఉండేటట్లు చూడటం
7. అందుబాటులో, విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులను అందించడం
8. సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించి, సంపూర్ణ ఉత్పాదకతతో కూడుకున్న ఉద్యోగితను సాధించడం
9. మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత కొనసాగించదగిన పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, నవకల్పనలను ఆదరించడం
10. దేశం లోపల, దేశాల మధ్య అసమానతలు తగ్గించడం
11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేయడం
12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాలను పెంపొందించడం
13. పర్యావరణ మార్పు దాని ప్రభావంపై సత్వర చర్య
14. సుస్థిరాభివృద్ధికి సముద్రాలు, జల వనరుల సంరక్షణ
15. అడవులు, జీవావరణాలను పరిరక్షించడం, భూక్షీణత, జీవవైవిధ్య నష్టాన్ని నిలిపివేయడం
16. శాంతియుత, సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించడం, అందరికీ న్యాయం అందేలా చూడటం, అన్ని స్థాయిల్లో సమ్మిళిత బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం
17. సుస్థిరాభివృద్ధికి సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం
ఎస్డీజీ ఇండియా ఇండెక్స్
2015 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సమావేశంలో 193 దేశాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్వీకరించాయి. ప్రపంచ జనాభాలో 17శాతానికి పైగా జనాభాను కలిగి ఉన్న ఇండియా.. ప్రపంచ ఎస్డీజీ లక్ష్యాల సాధనకు ఇండియా లక్ష్యాల సాధన కీలకమైంది. నిర్దిష్టకాలంలో ఎస్డీజీ లక్ష్యాల సాధనకు ఇండియా కట్టుబడి ఉంది.
మొదటి ఎడిషన్
2018 డిసెంబర్లో ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ మొదటి ఎడిషన్‌ను ప్రకటించారు. దీనిని 62 సూచీలతో 39 టార్గెట్లతో 13 ఎస్డీజీ లక్ష్యాలతో ప్రకటించారు. భారత సగటు 57.
హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు 69 స్కోర్‌తో మొదటి స్థానంలో ఉండగా, 42 స్కోర్‌తో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, 9వ స్థానంలో తెలంగాణ ఉన్నాయి.
రెండో ఎడిషన్
2019 డిసెంబర్లో రెండో ఎడిషన్ ప్రకటించారు. 100 సూచీలతో 54 టార్గెట్లతో 17 లక్ష్యాలతో వెల్లడించారు. 16 లక్ష్యాలకు ర్యాంకులు ప్రకటించగా, 17వ లక్ష్యాన్ని గుణాత్మకంగా అంచనా వేశారు. దేశ సగటు 60. కేరళ ప్రథమస్థానంలో కేరళ(70) ఉంది. చివరి స్థానంలో బిహార్(50) నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు (67) స్కోరుతో మూడో స్థానంలో ఉన్నాయి.
మూడో ఎడిషన్
2021 జూన్‌లో మూడో ఎడిషన్ ను 115 సూచీలతో 70 టార్గెట్లతో 17 లక్ష్యాలను ప్రకటించారు.
ఇండియా స్కోర్ 66
రాష్ట్రాల స్కోర్ 52 నుంచి 75 మధ్య, కేంద్రపాలిత ప్రాంతాల స్కోర్ 62 నుంచి 79 మధ్య ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్డీజీ ఇండెక్స్‌ను గణిస్తే 1. కేరళ(75), 2. హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు(74), 3. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్(72) స్కోర్‌తో ముందంజలో ఉండగా, 52 స్కోర్‌తో బిహార్ చివరిస్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంలో ప్రథమ స్థానంలో చండీగఢ్(79), చివరి స్థానంలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ(62) ఉన్నాయి. 2020–21 ఎస్డీజీ ఇండెక్స్‌లో 15 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం అస్పిరెంట్గా, ఏ ఒక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం అచీవర్‌గా లేవు. మిగిలిన 14 రాష్ట్రాలు ఫర్‌ఫార్మర్‌గా ఉన్నాయి.
ఫాస్టెస్ట్ మూవర్
2019 నుంచి 2020 నాటికి ఎస్డీజీ ఇండెక్స్ స్కోర్‌లో ఎక్కువ పెరుగుదల గల రాష్ట్రం మిజోరాం. రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో ఉత్తరాఖండ్ ఉన్నాయి.