ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చేలా వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అని పిలుస్తారు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఉండాలని సుస్థిరాభివృద్ధి సూచిస్తుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థికవృద్ధి ఒక్కటే సరిపోదు, వనరుల వినియోగం, పున: కల్పనల మధ్య సమతుల్యతలను ఏర్పరిచి అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో అభివృద్ధి వ్యూహాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సామూహిక అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి.
మానవ జనాభా పెరిగే కొద్దీ అవసరాల కోసం అభివృద్ధి పేరుతో సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జల వనరులు, వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. పేదరికం, తాగునీటి సమస్య, అంటువ్యాధులు ప్రబలి సామాజిక సమస్యలకు దారి తీయడమే కాకుండా వనరుల కొరత తీవ్రమై భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.
నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ: దీని ప్రధాన లక్ష్యం విద్యుత్తును ఆదా చేయడం, దీనికి విద్యుత్ వినియోగ పరికరాలకు రేటింగ్ ఇవ్వడం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని ప్రోత్సహించడం.
నేషనల్ మిషన్ ఫర్ సస్టయినబుల్ హాబిటెట్: విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడం, హరిత ప్రజా రవాణాను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆవాసాలను అభివృద్ధి పరుచుకోవడం దీని ముఖ్యోద్దేశం.
నేషనల్ వాటర్ మిషన్: సమీకృత నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాను అరికట్టడం, అభిలషణీయమైన రీతిలో నీటి వినియోగానికి సంబంధించి అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతానికి పెంచడం.
నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినింగ్ ది హిమాలయన్ ఎకో సిస్టమ్: దీని ప్రధాన ఉద్దేశం సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా హిమాలయ ప్రాంతాల్లో జీవవైవిధ్య సంరక్షణ, అటవీ సంరక్షణ, హిమానీనదాల పరిరక్షణను చేపట్టడం.
నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా: ప్రస్తుతం ఉన్న 23 శాతం అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం, నాశనమైన అటవీ భూమిలో 10 మిలియన్ హెక్టార్లలో మొక్కలను పెంచే కార్యక్రమం చేపట్టడం. 2020 నాటికి కార్బన్ శోషక వనరుల సామర్థ్యాన్ని 50 నుంచి 60 మిలియన్ టన్నులకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం.
నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్: వ్యవసాయ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు పెంపొందించడం, సాంకేతికపరమైన మౌలిక వస్తువుల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ తగిన వ్యవసాయ మౌలిక వస్తువులను అభివృద్ధి చేసుకోవడం. ఇందులో ముఖ్యమైన అంశాలు.. ఎ. శీతోష్ణస్థితికి అనుకూలమైన పంటల ఎంపిక. బి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మళ్లించడం.
నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ ఛేంజ్: శీతోష్ణస్థితి శాస్త్రం ప్రకారం సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనం, తదనుగుణంగా చేపట్టే చర్యలకు రూపకల్పన చేయడం.
బచావత్ ల్యాంప్ యోజన: సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఇంధన పొదుపు కోసం చేపట్టిన కార్యక్రమం. 2009లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ముఖ్యోద్దేశం సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ (సీఎఫ్ఎల్) బల్బులను అందించడం, దీన్ని క్యోటో ప్రొటోకాల్‌లోని క్లీన్ డెవలప్మెంట్ మెకానిజాన్ని (సీడీఎం) ఉద్దేశించి అమలు చేస్తున్నారు.
గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్: దీనిని 2001లో ఏర్పాటు చేశారు. దీని ముఖ్యోద్దేశం భారత్‌ను 2025 నాటికి ప్రపంచంలో ఒక పర్యావరణ హితమైన సుస్థిరాభివృద్ధి దేశంగా చేయడం. దీని లక్షణాలు 1. అభిలషణీయమైన రీతిలో నీటిని వినియోగం, 2. ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉండటం, 3. సహజ వనరుల పరిరక్షణ, 4. వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం.
గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటెట్ అసెస్మెంట్: ఇది ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లో భాగంగా అభివృద్ధి పరిచిన ప్రాజెక్టు. దీని ముఖ్యోద్దేశం హరిత నివాసాలను నిర్మించడం. ఈ సంస్థ నిర్మించే ఇళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు. ఇంధన వినిమయం తక్కువ, సహజ వనరుల విచ్ఛిన్నత తక్కువ, నీటి కాలుష్యం తగ్గించడం, నీటి వినియోగం తక్కువ, వ్యర్థాల ఉత్పత్తి తక్కువ.
నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ప్లాన్
ఇది శీతోష్ణస్థితి మార్పులపై భారత్ మొదటి కార్యాచరణ ప్రణాళిక. దీనిని 2008, జూన్ 30న మన్మోహన్సింగ్ విడుదల చేశారు. దీని ముఖ్యోద్దేశం శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, కాలపరిమితితో కూడిన కాలుష్యరహిత అభివృద్ధి పథకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడం. ఇందులో భాగంగా భారతదేశం వివిధ రంగాలకు చెందిన ఎనిమిది రకాల మిషన్స్ చేపట్టి జీహెచ్జీఎస్ ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తారు. ఎనిమిది రకాల మిషన్స్ ఈ విధంగా ఉన్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ సిస్టమ్
- సౌర విద్యుత్తును ప్రోత్సహించడం, అభివృద్ధి పరచడం
- పట్టణాలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంబంధ నిర్మాణాల వద్ద సోలార్ ఎలక్ట్రిసిటీ వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడం.
- ఏటా సోలార్ విద్యుత్ సామర్థ్యం గల సౌర విద్యుత్తు ఉత్పత్తి పెంచడం.
గ్రీన్ ట్రాన్స్పోర్ట్
ఇందులో భాగంగా జీవ ఇంధనాలను, సౌరశక్తిని వాడటంతోపాటు శిలాజ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని ప్రత్యేక ప్రమాణాలు వాడుతారు. ఈ ప్రమాణాలను యూరోపియన్ దేశాల్లో యూరో స్టాండర్డ్స్ అంటారు. ప్రస్తుతం ఈ ప్రమాణాలను యూరప్ దేశాల్లో అమలు చేయగా, భారత్ యూరో–4ను కచ్చితంగా అమలుపరచాలని 2014లో ఏర్పడిన జయప్రకాశ్ మోహన్ కమిటీ సూచించింది. కాలుష్యం తగ్గించడానికి బ్లెండింగ్ ప్రక్రియ కూడా ఉపయోగకరమైంది. బ్లెండింగ్ అంటే పెట్రోల్‌కు ఇథనాల్ కానీ డీజిల్ కానీ బయో డిజిల్‌ను కానీ కలపడం. దీని ఫలితంగా ఇంధన వినియోగం, కాలుష్యం తగ్గుతుంది.
ప్రకాశ్ పథ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం లైట్ ఎమిటైడ్ డియోడ్స్(ఎల్ఈడీ) బల్బులను పంపిణీ చేయడం, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు..
- ఎక్కువ గంటలు పనిచేయడం,
- తక్కువ వాట్స్ విద్యుత్‌ను వినియోగించడం,
- హెచ్జీని విడుదల చేయదు.
- గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ను విడుదల చేయదు, 5. మన్నిక ఎక్కువ.