మమతా జీ కాసుకో.. నెక్ట్స్ టార్గెట్ బెంగాలే: సువేందు అధికారి వార్నింగ్

మమతా జీ కాసుకో.. నెక్ట్స్ టార్గెట్ బెంగాలే: సువేందు అధికారి వార్నింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 26 ఏళ్లు సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు దేశ రాజధానిలో కాషాయ జెండా పాతింది. ఢిల్లీలో బీజేపీ విజయంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ కీలక నేత సువేందు అధికారి హాట్ కామెంట్స్ చేశారు. ఆప్‎ను మట్టికరిపించడంతో ఢిల్లీలో బీజేపీ టాస్క్ పూర్తి అయ్యింది.. ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ బెంగాలేనని ఆయన పేర్కొన్నారు. 2026  బెంగాల్‎ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే బీజేపీ తర్వాతి లక్ష్యమని స్పష్టం చేశారు. ఢిల్లీ తర్వాత బీజేపీ విజయం సాధించబోయే తర్వాతి రాష్ట్రం వెస్ట్ బెంగాలేనని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. 

‘‘ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించింది. అవినీతికి పాల్పడిన ఆప్ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఢిల్లీలో నివసిస్తోన్న బెంగాల్ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. తద్వారా.. ఢిల్లీలోని బెంగాలీలు ఎక్కువగా నివసించే చాలా ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. ఢిల్లీలో నేను కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశా. ఢిల్లీలో మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆప్ ఢిల్లీని నాశనం చేసింది. అందుకే ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.

 ప్రధాని మోడీ మాత్రమే ఢిల్లీకి పునర్ వైభవాన్ని తీసుకురాగలరు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యం. ఇక నుంచి ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ ఫలితాలు పొందుతారు. ఢిల్లీలో విజయం సాధించాం. ఇక నెక్ట్స్ టార్గెట్ బెంగాల్’’ అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంతో ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని బెంగాలీ సమాజం ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలబడ్డందుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి.  2011 నుంచి బెంగాల్‎లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎలాగైనా బెంగాల్‎లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అప్రతిహత విజయాలు సాధిస్తూ వస్తోన్న మమతా బెనర్జీని ఢిల్లీలో కేజ్రీవాల్‎ను మట్టికరిపించిన విధంగానే చిత్తు చేయాలని ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.