
Suzlon Energy: గడచిన కొన్ని రోజులుగా సుజ్లాన్ స్టాక్ మార్కెట్ అస్థిరతలకు లోనవుతోంది. దీంతో కొన్ని నెలల కిందట రూ.70 మార్కును క్రాస్ చేసిన స్టాక్ ఆ తర్వాత భారీగానే క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మార్కెట్లు తిరిగి పుంజుకోవటంతో పాటు కంపెనీ ఆర్డర్ బుక్ రోజురోజుకూ బలంగా మారటంతో ఇన్వెస్టర్లు ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్ కొనుగోలు కోసం తిరిగి ఎగబడుతున్నారు.
నేడు కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం పెరుగుదలతో రూ.55.71 గరిష్ఠానికి ఇంట్రాడేలో చేరుకున్నాయి. కంపెనీకి సన్‌ష్యూర్ ఎనర్జీ నుండి 100.8 మెగావాట్ల పవన విద్యుత్ ఆర్డర్ అందుకుంది. ప్రాజెక్టును కంపెనీ మహారాష్ట్రలో ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. తాజా ఒప్పందం కింద కంపెనీ హైబ్రిడ్ లాటిస్ టవర్లు కలిగిన 48 S120 విండ్ టర్బైన్ జనరేటర్లను సరఫరా చేయనున్నట్లు వెల్లడైంది. కంపెనీ వీటి ఏర్పాటుతో పాటు నిర్వహణను సైతం తర్వాతి కాలంలో కొనసాగించనుందని వెల్లడైంది.
2030 నాటి భారత్ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పెద్ద కంపెనీలు విండ్ ఎనర్జీ వైపుకు మారుతున్నాయని సుజ్లాన్ సీఈవో చలసాని పేర్కొన్నారు. ఇది పరివర్తనతో పాటు పరిశ్రమ అంతటా స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు కూడా దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అనేక బ్రోకరేజీలు కంపెనీ షేర్లు రానున్న కాలంలో రూ.70 స్థాయికి తిరిగి చేరుకుంటాయని తమ అంచనాలను పంచుకున్న సంగతి తెలిసిందే.
►ALSO READ | Solar Power: వేగంగా సోలార్‌కి మారుతున్న భారత్.. ప్రతి 45 రోజుల్లో లక్ష గృహాలకు..
ప్రస్తుతం కంపెనీలో 25 శాతం మేర రిటైల్ పెట్టుబడిదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మార్చి త్రైమాసికంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తమ హోల్డింగ్స్ తగ్గించుకోగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు తమ వాటాను దాదాపు 23 శాతం వద్ద అలాగే కొనసాగిస్తున్నారు.
బ్రోకరేజీల టార్గెట్ ధరలు ఇలా..
- సుజ్లాన్ ఎనర్జీపై మోర్గాన్ స్టాన్లీ "ఓవర్ వెయిట్" రేటింగ్‌ను రూ. 71 టార్గెట్ ధరతో కొనసాగించింది
- దేశీయ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ సుజ్లాన్ షేర్లకు "BUY" రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.70 వద్ద కొనసాగిస్తోంది
- ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్‌లపై బుల్లిష్‌గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ తన టార్గెట్ ధరను గతంలో ప్రకటించిన రూ.50 నుంచి రూ.60కి పెంచుతూ BUY రేటింగ్ అందిస్తోంది.
- జేఎం ఫైనాన్షియల్ సుజ్లాన్ ఎనర్జీపై "BUY" రేటింగ్‌ను రూ. 71 టార్గెట్ ధరతో కొనసాగించింది
- జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్‌కు రూ. 71 టార్గెట్ ధరతో "BUY" రేటింగ్ సిఫార్సు చేసింది
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.