స్వచ్ఛ భారత్.. వెయ్యేండ్లైనా గుర్తుంటది: మోదీ

స్వచ్ఛ భారత్.. వెయ్యేండ్లైనా గుర్తుంటది: మోదీ
  • ఇది 21వ శతాబ్దంలో అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం: మోదీ
  • పదేండ్లలో 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించాం
  • ‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేండ్లు పూర్తి 

న్యూఢిల్లీ: ఈ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం ‘స్వచ్ఛ భారత్’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఒక వెయ్యేండ్ల తర్వాతైనా 21వ శతాబ్దపు ఇండియా గురించి మాట్లాడుకుంటే, కచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్​ను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రజలందరి సహకారంతో ఈ మిషన్ సక్సెస్ అయిందని చెప్పారు. ‘సేవా పఖ్వాడా’లో భాగంగా కేవలం 15 రోజుల్లోనే 27 లక్షలకు పైగా ఈవెంట్స్ నిర్వహించగా, 28 కోట్ల మంది పాల్గొన్నారని తెలిపారు. ‘‘గత ప్రభుత్వాలు పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్మాగాంధీ పేరును వాడుకున్నోళ్లు..

ఆయన విధానాలను మాత్రం ముందుకు తీసుకెళ్లలేదు.  పదేండ్ల కింద 60 శాతానికి పైగా ప్రజలు మల విసర్జనకు బయటకు వెళ్లేవారు. పరిసరాల అపరిశుభ్రతతో రోగాల బారిన పడేవారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత టాయిలెట్స్ నిర్మాణం, శానిటరీ ప్యాడ్స్ పంపిణీపై దృష్టిపెట్టాం. 12 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించాం. ఒకప్పుడు 40% కంటే తక్కువున్న టాయిలెట్స్ ఇప్పుడు 100 శాతానికి చేరుకున్నాయి” అని వెల్లడించారు. ‘‘స్వచ్ఛ భారత్ గొప్ప ఫలితాలు ఇచ్చిందని ఎన్నో స్టడీల్లో తేలింది. డయేరియా మరణాలను తగ్గించి 2014–19 మధ్య 3 లక్షల ప్రాణాలను కాపాడినట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

పిల్లల మరణాలను తగ్గించి ఏటా 60 వేల నుంచి 70 వేల మందిని కాపాడుతున్నట్టు మరో స్టడీ వెల్లడించింది. టాయిలెట్స్ నిర్మాణంతో 90% మంది మహిళలు సేఫ్​గా ఫీల్ అవుతున్నారని యూనిసెఫ్ పేర్కొంది” అని వివరించారు. పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాగా, స్వచ్ఛ భారత్, అమృత్ 2.0 మిషన్ల కింద రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.  

గిరిజనుల అభివృద్ధికి 80 వేల కోట్లు.. 

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన బుధవారం జార్ఖండ్​లో ధర్తి ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద రూ.79,150 కోట్లతో 65 వేల గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.

రజినీకాంత్ ఆరోగ్యంపై ఆరా..  

నటుడు రజినీకాంత్ త్వరగా కోలుకోవా లని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బుధవారం ఆయన రజినీ భార్య లతకు ఫోన్ చేసి మాట్లాడారు. రజినీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధప డుతున్న రజినీకాంత్ ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

చీపురు పట్టిన మోదీ.. 

మహాత్మాగాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా క్లీన్లీనెస్ డ్రైవ్ లో ప్రధాని మోదీ పాల్గొన్నా రు. బుధవారం ఢిల్లీలోని స్కూల్ కు వెళ్లిన ఆయన.. అక్కడి పిల్లలతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వారితో ఇంటరాక్ట్ అయ్యారు. పరిసరాల పరిశుభ్రత, యోగా, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి వివరించారు.