భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ గురుకులం విజయవంతమైందని డీడీ రమాదేవి తెలిపారు. ఆదివారం భద్రాచలం గిరిజన సంక్షేమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నెల 6 నుంచి 11 వరకు అన్ని ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో హాస్టళ్లు, వంటశాలలు, డైనింగ్ హాళ్లు, పరిసరాలు శుభ్రం చేసినట్లు చెప్పారు. ఏటీడీవో నర్సింహారావు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారక, హెచ్ఎం సావిత్రి, స్వాతి పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ జాబ్స్ ఎగ్జామ్ రద్దు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పాల్వంచలోని మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్న డాటా ఎంట్రీ, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన ఎగ్జామ్ రద్దు కావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు హాల్ టికెట్లు రాలేదని పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్క్రూటినీలో కొందరు అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించామని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పినా వినకపోవడంతో ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ప్రజాసంఘాల నాయకులు కాలేజీ ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.
రామయ్యకు అభిషేకం, బంగారు పుష్పార్చన
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ చేసిన అనంతరం బాలబోగం నివేదించారు. తర్వాత బంగారు పుష్పాలతో అర్చన చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
26 నుంచి వాల్మీకి రామాయణ పారాయణం
ఈ నెల 26 నుంచి అక్టోబరు 5 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులతో వాల్మీకి శ్రీరామాయణ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. ఈ పారాయణంలో పాల్గొనే భక్తులకు
ఉచితంగా వసతి, దర్శనం, భోజనం కల్పిస్తామని చెప్పారు. ఈ పారాయణంలో ఎటువంటి వివక్షత లేకుండా అందరూ కలిసి సామూహికంగా చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 108 మంది భక్తులకు ఈ అవకాశం ఉందని, పేరు, పూర్తి వివరాలతో ఈనెల 20 లోగా నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9866743100, 9492751161, 9441000679 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలి
భద్రాచలం, వెలుగు: గొల్ల కురుమలకు గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలని గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాసాని అయిలయ్య డిమాండ్ చేశారు. భద్రాచలంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఇక్కడి వాతావరణంలో అవి ఇమడలేక చనిపోతున్నాయని, దీంతో గొర్రెల కాపర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ పెరిగి పథకం లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సత్యం, ఆకోజు సునీల్ పాల్గొన్నారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్రు
వైరా, వెలుగు: అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బీజీ క్లైమేట్ అవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైరాలో జరిగిన ఏఐటీయూసీ మండల 3వ మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న నేలకొండపల్లిలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ , సీపిఐ జిల్లా కార్య వర్గ సభ్యుడు ఎర్ర బాబు, యామాల గోపాలరావు, కొల్లి నాగభూషణం పాల్గొన్నారు.
వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కూసుమంచి,వెలుగు: మండల కేంద్రానికి చెందిన ఎలక వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ఆయన చేసిన కృషిని కొనియారు. అనంతరం మండలంలోని పెరికసింగారం, రాజుపేట, జక్కేపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అలాగే మునిగేపల్లిలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎంపీపీ బానోతు శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య, ఎండీ ఆసీఫ్ పాషా, మాజీ సర్పంచ్ జాగర్లమూడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం నాటికి గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అత్యవసర సేవలకు కొత్తగూడెంలోని కలెక్టరేట్‌తో పాటు భద్రాచలంలోని సబ్ కలెక్టర్
ఆఫీస్‌లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. భారీ వర్షాలతో వాగులు పొంగే అవకాశం ఉందని, ప్రజలు వాగులు దాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలె
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత స్వామి వివేకానందదేనని బీఐహెచ్ఈ ఫౌండర్ దేవకీ వాసుదేవరావు చెప్పారు. స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం 129వ వార్షికోత్సవం సందర్భంగా వివేకానంద హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. డాక్టర్ శీలం పాపారావు, అంకతి పాపారావు, అంజయ్య, వేల్పుల సుధాకర్, గన్నవరపు చంద్రశేఖర్, జై పటేల్, ప్రవీణ్ పటేల్ పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు
ఖమ్మం టౌన్, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. చింతకాని మండలంలో 3462 మందికి రూ. 9.90 లక్షల చొప్పున 346.20 కోట్లు, 5 నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులకు రూ. 9.90 లక్షల చొప్పున రూ.48.30 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పా రు. 5 నియోజకవర్గాల్లో 483 యూనిట్లను గ్రౌండింగ్ చేశారని, చింతకాని మండలంలో 1052 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందని తెలిపారు.
నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్
ఖమ్మం టౌన్, వెలుగు: నేటి నుంచి ఈ నెల 24 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్ జరుగుతాయని డీఈవో ఎస్ యాదయ్య తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మద్దినేని పాపారావు(8008403522)ను సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జేఈఈలో జిల్లాకు టాప్ ర్యాంకులు
ఖమ్మం టౌన్, వెలుగు: జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించారు. ఖమ్మంలోని హార్వెస్ట్ కాలేజ్ నుంచి 53 మంది ఎగ్జామ్ రాయగా, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ రవి మారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. జి.ధనుంజయ్ ఆల్ ఇండియా 3436వ ర్యాంకు, ఈడబ్ల్యూయూఎస్లో 40 వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఎస్సీ కేటగిరీలో ఎన్.ఆదర్శ్ 540, పి.వెంకట నాగవర్షిత్ 3,822, ఓబీసీ కేటగిరిలో ఎం.సాత్విక్ 3,598, ఉజ్వల సాయి రాహుల్ 3,737 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వై.చక్రధర్ రెడ్డి 8,575,ఈడబ్ల్యూయూఎస్ కోటాలో పి.అన్షీత రెడ్డి 1761, సీహెచ్ సరయు 2,344, ఎ. మోక్షజ్ఞ సాయి 2,853, ఎం.శశాంక్ ఆదిత్య 3,348, ఎ. హేమంత్ 3,478, ఎస్టీ కోటాలో జి.అభిరానందన్ 1423, ప్రీపరేటరీ విభాగంలో జి.ప్రణయ్ 231, బి.అశోక్ 707, కె.అన్వేష్ 2392, ఎస్.యతేంద్రకుమార్ 2,839 వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు.
రెజోనెన్స్ లో..
రెజోనెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కాలేజ్ డైరెక్టర్స్ ఆర్వీ నాగేంద్ర కుమార్, కె శ్రీధర్ రావు తెలిపారు. ఐఐటీ జేఈఈ విభాగంలో బి.మహేందర్ 108, జె.సాయి కుమార్ 558, ఎం.రుత్విక 670, డి. సిసిరో 735, జి.ప్రణయ్ 773, కె.సాహిత్య 1096, డి.వినోద్ 1174, వి.సుప్రజ 3306, బి.శివాని 4784, జై.సాయి 6793 ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ సతీష్, ఎం.భాస్కర్ రెడ్డి, శాంతి తదితరులు వారిని అభినందించారు.
న్యూవిజన్ లో..
ఓపెన్ కేటగిరీలో కె.వైభవ్ చౌదరి 272 వ ర్యాంకు సాధించినట్లు న్యూ విజన్ కాలేజీ చైర్మన్ సీహెచ్ జీకే ప్రసాద్ తెలిపారు. ఎస్టీ కేటగిరీలో 4 వ ర్యాంకు, వివిధ కేటగిరీల్లో 29 మంది స్టూడెంట్స్ 1000 లోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో శ్రీ దుర్గా 1778, ఎస్.సాయి అమృత వర్షిణి 1897, ఎన్.నాగభువిత్ 3483, టి.పవన్ సిద్దార్థ 4,329, ఎం లోహితశ్రీ 4659, ఎన్.శ్రీరామ్ 4,678, జె.సూర్య శ్రీజ 6259, కె.సాయి అభిషేక్ 6,519, జి.జస్వంత్ 6,592, జె.మయంక్ 6809, ఎన్.కౌశిక్ 7231, వి.దీక్షిత రెడ్డి 7402, ఆర్.అభ్యుదయ్ 8,311 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. డైరెక్టర్ సీహెచ్ గోపిచంద్, అకాడమిక్ డైరెక్టర్ సీహెచ్ కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు స్టూడెంట్స్‌ను అభినందించారు.
కొత్తగూడెం స్టూడెంట్స్ ప్రతిభ
భద్రాద్రికొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లిలోని కృష్ణవేణి జూనియర్ కాలేజీకి చెందిన బి. ప్రవళ్లిక 356, వి. హేమంత్ 805, డి. మౌనిశ్రీ 2253 ర్యాంకు సాధించినట్లు కాలేజీ డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీష్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ బి. వీరన్న తెలిపారు. తమ కాలేజీ స్టూడెంట్లు జేఈఈ మెయిన్స్‌లో అడ్మిషన్లకు అర్హత పొందారని శ్రీనలంద జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ చౌదరి చెప్పారు.
టేకులపల్లి స్టూడెంట్ కి 253వ ర్యాంక్టేకులపల్లి: మండలానికి చెందిన ఇస్లావత్ విధాత్ వీరేంద్ర పమార్ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 253వ ర్యాంక్ సాధించాడు. కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు ఆయనను అభినందించారు.
బాజుమల్లాయిగూడెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
కారేపల్లి,వెలుగు: మండలంలోని బాజుమల్లాయిగూడెంలో ఓ దుకాణం వద్ద జరిగిన గొడవ పెరిగి ఆదివారం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని దమ్మాలపాటి సతీశ్ వర్గానికి మద్దెల సతీశ్ వర్గానికి మధ్య ఓ కిరాణషాపులో నిర్వహించే బెల్ట్‌షాపు వద్ద గొడవ జరిగింది. ఈ గొడవ రెండు వర్గాల వారికి తెలియడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. మద్దెల సతీశ్, మద్దెల రామ్మూర్తి, గోకర సైదులు, గణేశ్వరితో పాటు పలువురు గాయపడ్డారు. ఇరు వర్గాలకు చెందిన 27మందిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుశకుమార్ తెలిపారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 35 అడుగులు ఉన్న వరద సోమవారం నాటికి 40 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం కారణంగా ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది. తాలిపేరు, కిన్నెరసాని నదులకు వాగులు, వంకల నుంచి భారీగా వరద వస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. తాలిపేరు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 1,03,543 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువన మేడిగడ్డ, కాళేశ్వరం నుంచి కూడా వరద నీరు భద్రాచలం వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 515.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పినపాకలో 76.4, చర్లలో 33.6, దుమ్ముగూడెంలో 60.4, అశ్వాపురంలో 58.6, మణుగూరులో 42.6, గుండాలలో 40.2, ఇల్లందులో 15, టేకులపల్లిలో 17, జూలూరుపాడులో 21.6, చండ్రుగొండలో 6.2, కొత్తగూడెంలో 16.2, పాల్వంచలో 12.4, బూర్గంపాడులో 26.4, భద్రాచలంలో 27, ములకలపల్లిలో 26.4, దమ్మపేటలో 20,అశ్వారావుపేటలో 15.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది.
మృతుల కుటుంబాలకు పొంగులేటి పరామర్శ
కూసుమంచి,వెలుగు: మండలంలోని నాయకన్‌గూడెం, జక్కేపల్లి, పెరికసింగారం, కొత్తూరు, కూసుమంచి గ్రామాల్లో ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. టీఆర్ఎస్ నేతలు స్వర్ణకుమారి, పిడమర్తి రవి, బజ్జూరి వెంకటరెడ్డి, జూకూరి గోపాల్‌రావు, బారి శ్రీను, ఆలింగ గోవిందరెడ్డి, జీవన్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కారేపల్లి,వెలుగు: పనికి వెళ్లడం లేదని భార్య మందలించడంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గేట్ కారేపల్లికి చెందిన కల్తి కొండయ్య(36) చీమలవారిగూడెంలో ఉంటున్నాడు. పోచారంలోని ఓ రైతు వద్ద జీతానికి కుదిరిన కొండయ్య నాలుగు రోజులుగా మద్యం తాగుతూ పనికి వెళ్లడం లేదు. పనికి వెళ్లకపోవడంతో భార్య మందలించడంతో ఇంటి ముందు వరండాలో ఊరేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారేపల్లి ఎస్సై కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంక్వైరీలతో దిగజారుతున్న సొసైటీ గ్రేడ్
ములకలపల్లి, వెలుగు: ములకలపల్లి పీఏసీఎస్ గ్రేడ్ ఎంక్వైరీలతో దిగజారుతోంది. గతంలో ఏ గ్రేడ్ లో ఉన్న సొసైటీ నేడు సీ గ్రేడ్ కు పడిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ములకలపల్లి సొసైటీ ఏ గ్రేడ్ లో నిలిచి ప్రశంసలు పొందింది. కొత్తగా ఎన్నికైన కమిటీ గత పాలకవర్గం హయాంలో జరిగిన లావాదేవీలపై 51 ఎంక్వైరీ చేయాలని తీర్మానం చేసి జిల్లా కోపరేటివ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్టును జిల్లా అధికారులకు అందజేశారు. ఆ ఆడిట్ నివేదిక బయటకు రాక ముందే మరోసారి సంఘంలోని ఇద్దరు డైరెక్టర్లు సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్, డీసీవో, చైర్మన్ లకు ఫిర్యాదు చేశారు. ఇలా ఎంక్వైరీల పేరుతో సొసైటీలో లావాదేవీలు నిలిచిపోతున్నాయి.