ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: గురుకుల స్కూళ్లల్లో ఈ నెల 5 నుంచి 11 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు.  శనివారం వనపర్తి మండలంలోని మర్రికుంట ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ గురుకుల వారోత్సవాల పోస్టర్‌‌‌‌ను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 5న చెత్త తొలగింపు, 6న స్కూల్ బిల్డింగ్  డార్మెట్రీలను శుభ్రం చేయడం, 7 న టాయిలెట్స్, నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, 8న వంటగది, డైనింగ్ ఏరియా పరిసరాలను క్లీన్‌‌ చేయటం, 9న  మొక్కలు నాటడం, 10న సాంస్కృతిక కార్యక్రమాలు, 11న వారోత్సవాల ముగింపు ఉటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ ఆర్‌‌‌‌సీవో నాగరాజు, డీటీడీవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గోవర్ధన్, తిరుపతయ్య పాల్గొన్నారు.

స్వాహా చేసిన రెంట్‌‌ డబ్బులు రికవరీ చేయాలి:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ
వనపర్తి, వెలుగు: సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు స్వాహా చేసిన వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీసీసీబీ చెందిన కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలను రికవరీ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి‌‌.కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ డీసీసీబీ బ్యాంక్ ఆవరణలో నాబార్డ్ సాయంతో నిర్మించిన  షాపింగ్‌‌ కాంప్లెక్స్ రెంట్లను పీఏసీఎస్‌‌  చైర్మన్, వైస్ చైర్మన్లు  సొంత బ్యాంకు అకౌంట్లలోకి మళ్లించుకున్నారని ఆరోపించారు.  నాబార్డ్ రూల్స్‌‌ ప్రకారం డీసీసీబీ బ్యాంకులు కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించొద్దని గుర్తుచేశారు.  మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించి అక్రమార్కులను సస్పెండ్ చేయాలని  డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, కార్యదర్శి బి. పరశురాం,జిల్లా అధికార ప్రతినిధి,  మీడియా ఇన్‌‌చార్జి పెద్దిరాజు, పట్టణ అధ్యక్షుడు బోయెల్ల రామ్మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు సూగురు రాము, మామిళ్ళపల్లి రాయన్న  పాల్గొన్నారు.

ఆర్టీసీ జీతాలు ఏపీలోనే ఎక్కువ:టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువగా జీతాలు ఇస్తున్నారని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. శనివారం డీసీసీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో అటెండర్ బేసిక్ పే 10వేలకు పైగా ఉంటే ఏపీలో 20వేలు, కండక్టర్ బేసిక్ పే 12,610 ఉంటే ఏపీలో రూ. 25,200 ,  డ్రైవర్ బేసిక్ వేతనం 13వేలు ఉండగా ఏపీలో 27,800 ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2013లో కాంగ్రెస్  హయాంలో 27శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తుచేశారు. 2015లో 44శాతం పీఆర్సీ ఇచ్చిన కేసీఆర్‌‌‌‌ సగం డబ్బులకు 6 ఏళ్ల కాలపరిమితిలో 2020లో మెచ్చుర్ అయ్యేటట్లు బాండ్స్ ఇచ్చారన్నారు. బాండ్ కాలపరిమితి అయిపోయి రెండేళ్లైనా కనీసం మిత్తి కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2017,   2021 రావల్సిన  పీఆర్సీ లేనేలేదని, 7 డీఏలో ఇవ్వలేదన్నారు. ఆర్టీసి కార్మికుల శ్రమను కేసీఆర్‌‌‌‌ గుర్తించకపోవడం బాధకరమని, 15,16 గంటల పని చేయించుకుని 2 గంటల ఓటీ ఇస్తున్నారని మండిపడ్డారు.  మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ ఎం.సాయిబాబా పాల్గొన్నారు.

కరెంట్ షాక్‌‌తో కానిస్టేబుల్ మృతి
మృతదేహానికి నివాళి అర్పించిన ఎస్పీ అపూర్వ రావు
వనపర్తి టౌన్, పెద్దమందడి, వెలుగు:  అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి 2012 బ్యాచ్‌‌కు చెందిన ఏఆర్‌‌‌‌ కానిస్టేబుల్‌‌ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన బాజ శ్రీనివాస్(38) వనపర్తి జిల్లా కేంద్రంలో డాగ్‌‌ స్క్వాడ్‌‌ కానిస్టేబుల్‌‌గా పని చేస్తున్నాడు.  శనివారం తెల్లవారుజామున అన్న కొడుకు భరత్‌‌తో కలిసి తన పొలం వద్దకు వెళ్లాడు. పందులు రావడం గమనించిన వారు వెళ్లగొట్టేందుకు వెళ్లగా పక్క పొలం రైతు ముడవత్ తన్యా ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్‌‌షాక్‌‌ కొట్టింది.  శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా భరత్‌‌కు గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు డెడ్‌‌బాడీని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వ రావు  మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులకు పరామర్శించి.. అంత్యక్రియల కోసం రూ.20 వేలు ఇచ్చారు.  అనంతరం ఎస్పీ ఆదేశాలతో మృతుడి స్వగ్రామం కానాయపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.  మృతుడికి భార్య మనీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ  కార్యక్రమంలో ఏఎస్పీ షాకిర్ హుస్సేన్ , డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి,   రిజర్వ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ జగన్, ఇతర పోలీస్ అధికారులు,  సిబ్బంది పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.

నియోజకవర్గంలో నిత్యం పర్యటించాలి
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం
అయిజ, వెలుగు: నియోజకవర్గంలో నిరంతరం పర్యటించి పరిశీలన చేస్తేనే సమస్యలు పరిష్కరిష్కారం అవుతాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం స్థానిక ఎమ్మెల్యే అబ్రహంను ఉద్దేశించి కామెంట్ చేశారు. శనివారం పట్టణంలోని ఆర్‌‌‌‌అండ్‌‌బీ గెస్ట్ హౌస్‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ  నియోజక వర్గంలోని అలంపూర్, రాయచూరు రోడ్డులో కల్వర్టుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడక్కడ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణం పెండింగ్‌‌లో ఉండడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతోందన్నారు.  అయిజ పట్టణంలోని పెద్దవాగు బ్రిడ్జి  పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7 కోట్లు  మంజూరు చేసిందని గుర్తుచేశారు.  పనులు కంప్లీట్ చేయకపోవడంతో వాగుకు వరద వచ్చిన ప్రతిసారి  ఇబ్బందులు తప్పట్లేదన్నారు. పులికల్–నాగలదిన్నె రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అంతకుముందు కేంద్రం గురించి మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తాసు పలుకుతోందని, ఆదాని ప్రపంచ ధనికుల్లో మూడో స్థానంలో ఉండడం ఇందుకు నిదర్శనం అన్నారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జీడీపీ రేటు 3.54 శాతం ఉంటే తెలంగాణలో 11.4 శాతం ఉందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌ దేశంలో బీజేపీ విముక్త పాలనకు  శ్రీకారం చుట్టారని, ఇందుకు ప్రజల మద్దతు కావాలన్నారు. ఈ సమావేశంలో వడ్డేపల్లి మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు,  అలంపూర్ తాలూకా మాజీ ఇన్‌‌చార్జి మందా శ్రీనాథ్, ఉప్పల ఎంపీటీసీ ప్రహ్లాద్‌‌ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్, లీడర్లు రవిరెడ్డి, 
నరసింహులు పాల్గొన్నారు. 

అతి వేగంతో కుటుంబాలను ఆగం చేయొద్దు
నెట్‌‌వర్క్, వెలుగు :  వాహనదారులు వేగంగా బండ్లు నడిపి, కుటుంబాలను ఆగం చేయవద్దని జిల్లా జడ్జిలు సూచించారు. శనివారం జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌‌ రూల్స్‌‌పై లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌‌, సీటు బెల్ట్‌‌ పెట్టుకోవాలని, సెల్‌‌ఫోన్‌‌ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవింగ్‌‌ చేయరాదని చెప్పారు.  బైక్‌‌పై ముగ్గురు ఎక్కవద్దని, రాంగ్‌‌ రూట్‌‌లో నడుపవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నెస్ పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ సీనియర్ సివిల్ జడ్జి సబిత,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప,   గద్వాల సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత దేవి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ప్రభాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కవిత, నారాయణపేట  ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎంఏ రఫీ, ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు,  బార్ అసోసియేషన్ మెంబర్స్‌‌ , ట్రాన్స్‌‌ఫోర్ట్ ఆఫీసర్లు, పోలీసులు పాల్గొన్నారు. 

బియ్యం స్టాక్ పాయింట్ డీటీ సస్పెన్షన్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్, బిజినేపల్లి బియ్యం గోదాం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్‌‌ను కలెక్టర్‌‌‌‌ ఉదయర్‌‌‌‌ కుమార్‌‌‌‌ సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ నెల 1న 230 క్వింటాళ్ల బరువున్న 460 బస్తాల పీడీఎస్‌‌ బియ్యాన్ని  AP 22V6789 వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై ఆఫీసర్లు సీజ్ చేసి విచారణ చేపట్టారు.   డీటీ వెంకటేశ్‌‌ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి స్టాక్ పాయింట్ నుంచి ఎలాంటి రసీదులు లేకుండా లారీలో బియ్యాన్ని తరలించినట్లు గుర్తించి కలెక్టర్‌‌‌‌కు రిపోర్ట్ ఇచ్చారు.  దీంతో కలెక్టర్  అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  ముందస్తు అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీల్లేదని  అందులో పేర్కొన్నారు.  

ప్లే గ్రౌండ్లకు స్థలాలు గుర్తించండి:కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు:  ప్లే గ్రౌండ్స్‌‌ కోసం సాధ్యమైనంత త్వరగా స్థలాలను గుర్తించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలతో  రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 65 గ్రామాల్లో  స్థలాలను గుర్తించలేదని,  కనీసం 20 గుంటలైనా గుర్తించాలని ఆదేశించారు. అంతకుముందు  పీహెచ్‌‌సీ డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో నిర్వహించిన మీటింగ్‌‌లో మాట్లాడుతూ మాతాశిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఆరుగురు బాలింతలు చనిపోయారని, ఇలాంటి రిపీట్ కావొద్దన్నారు. సర్కార్ దవాఖానాలో 24 గంటల పాటు గైనకాలజిస్టులు  అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.  అనంతరం స్వచ్ఛ గురుకులాల పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఈ కార్యక్రమాల్లో  జడ్పీ సీఈవో విజయ నాయక్, డీఆర్డీఏ ఏపీడీ నాగేంద్రం, చిల్డ్రన్ వెల్ఫేర్ ఆఫీసర్ ముసాయిదా బేగం, డీపీవో శ్యాంసుందర్  పాల్గొన్నారు.


ఉపాధి కూలీ పైసలు బయటోళ్ల అకౌంట్లలో జమ
కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన కూలీలు
మిడ్జిల్, వెలుగు:  ఉపాధి హామీ పథకం కింద పని చేసిన కూలీలకు కాకుండా ఇతరుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.  ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు  దాదాపు రూ.4 లక్షల వరకు బయటి వ్యక్తుల అకౌంట్లలో పడ్డాయి. విషయం తెలుసుకున్న అసలు కూలీలు తాను పనులు చేస్తే, వేరే వాళ్ల అకౌంట్లో పైసలు పడటం ఏంటని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే..  మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం దోనూరు గ్రామానికి చెందిన 44 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద చింతలకుంటలో లెవలింగ్, రోడ్డు పక్కన గడ్డిని తీయడం, ఉవకుంట లెవలింగ్​, చెట్ల వేర్లు తొలగించడం, చెట్లు నాటేందుకు గుంతలు తీయడం, కుంటల లెవలింగ్​, నర్సరీలో పనులు చేశారు. వీరికి దాదాపు రూ.3 లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉంది. కానీ, ఆఫీసర్లు  ఇతరుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. పనులు చేయని ఇద్దరు వ్యక్తులు పేరు మీద మార్చి, ఏప్రిల్​, మే, జున్​ నెలల్లో వీరి అకౌంట్లో దాదాపు రూ.14,506 జమ చేశారు.  వీరిద్దరికే కాకుండా మరికొంత మందికి కూడా దాదాపు రూ.2 లక్షల వరకు డబ్బులు జమ చేసినట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బాధిత కూలీలు శుక్రవారం స్థానిక ఎంపీడీవోతో పాటు కలెక్టర్​వెంకట్‌‌రావుకు ఫిర్యాదు చేశారు.  స్థానికంగా ఉన్న ఆఫీసర్లకు కొందరితో కుమ్మక్కై తమకు రావాల్సిన డబ్బులను ఇతరుల అకౌంట్లలో వేశారని ఆరోపించారు. 

ఎంక్వైరీ చేస్తాం
కూలీలు తాము చేసిన పనులకు డబ్బులు పడలేదని అంటున్నరు.  డబ్బులు పడిన వ్యక్తులు కూలీలా? కాదా? అనేది ఎంక్వైరీ చేస్తాం. దీనిపై రెండు రోజుల్లో కూలీలను, బ్యాంక్​ అకౌంట్​లలో డబ్బులు పడిన వ్యక్తులను పిలిపించి విచారణ చేస్తం. 
–జకియా సుల్తానా, ఏపీడీ, మహబూబ్​నగర్​ 

రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
అఖిలపక్ష నేతల ధర్నా
ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ర్యాలీ తీసి.. రాస్తారోకో నిర్వహించారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణ చేయకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు.  శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.  విషయం తెలుసుకున్న తహసీల్దార్‌‌‌‌ కృష్ణ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, త్వరలో రోడ్డు విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అఖిలపక్ష నాయకులు మోహన్ రెడ్డి, మహేశ్, అంజయ్య గుప్తా, పాండు, పద్మ అనిల్, పాండు ప్రసాద్, అజీమ్, గిరిజనులు  పాల్గొన్నారు.

వయస్సు మార్చి పింఛన్లు తీసుకోవద్దు:ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి
మరికల్​, వెలుగు:  ఆధార్‌‌‌‌ కార్డులో వయస్సు మార్చి పింఛన్లు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని  పేట ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో పింఛన్‌‌ కార్డులను పంపిణీ చేశారు.  పింఛన్ పత్రాన్ని తీసుకునేందుకు వచ్చిన ఓ 45 ఏళ్ల వ్యక్తిని గమనించిన ఆయన ‘నీకు వయస్సు లేదు కదా పింఛన్‌‌ ఎలా తీసుకుంటున్నావు’ అని ప్రశ్నించారు. ఆధార్‌‌‌‌ కార్డులో వయస్సు మార్చితే నష్టపోతారని, రైతుబీమా పథకం వర్తించదని చెప్పారు.   

బ్రిడ్జి పనులు మొదలు పెట్టాలి:సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్
మదనాపురం, వెలుగు: మదనాపురం రైల్వే గేటు నుంచి ఆత్మకూర్ వెళ్లే రోడ్డులో ఊకచెట్టు వాగుపై పెండింగ్‌‌లో ఉన్న బ్రిడ్జి పనులు వెంటనే మొదలు పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ నాయకులు, వాహనదారులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్కారు బ్రిడ్జి నిర్మాణం కోసం ఓపెన్ టెండర్లను పిలిచి మెగా కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీకి రూ. 9.25 కోట్ల పనులు అప్పగించిందని గుర్తు చేశారు. కాంట్రాక్టర్‌‌‌‌ పనులు ప్రారంభించి వదిలేశాడని మండిపడ్డారు.  సీపీఎం మండల కార్యదర్శి రాజు, నేతలు ప్రసాద్, వెంకటయ్య, వెంకట్ రాములు, చెన్నయ్య, విష్ణు, చిరంజీవి, మనివర్ధన్, సత్యన్న, భగత్ తిరుపతి పాల్గొన్నారు.

1500 ఎరువుల బస్తాలు సీజ్ 
గద్వాల, వెలుగు: ఫర్టిలైజర్ షాప్ లపై విజిలెన్స్ ఆఫీసర్లు శనివారం దాడులు చేశారు.  విజిలెన్స్ ఏడీఏ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గద్వాల మండలంలోని పరమేశ్వర ఫర్టిలైజర్‌‌‌‌ షాప్‌‌పై దాడులు చేసిన ఆఫీసర్లు ఒకచోట పర్మిషన్ తీసుకొని మరోచోట అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.  1500 సంచుల యూరియా, డీఏపీ తదితర ఎరువులను  సీజ్ చేసినట్లు ఏడీఏ తెలిపారు. వీటి విలువ 
రూ. 7.50 లక్షల వరకు ఉంటుందన్నారు.