మతం పేరుతో చిచ్చు పెడుతున్నరు : కేటీఆర్

  • బీజేపీపై మంత్రి కేటీఆర్​ ఆగ్రహం
  • చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్​
  • నేతన్న బీమా అమలు చేస్తమని హామీ
  • రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్​ ఒక్కరే: స్వామి గౌడ్
  • చివరి శ్వాస వరకూ కేటీఆర్​తోనే: దాసోజు శ్రవణ్

ఎల్​బీ నగర్, వెలుగు: మతం పేరుతో బీజేపీ దేశంలో చిచ్చు పెడుతోందని,  ఆ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత వస్త్రాల మీద 5 శాతం జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే నేత కార్మికులు కష్టాల్లో ఉన్నారని.. వారిపై పన్నుల భారం సరికాదన్నారు. వెంటనే జీఎస్టీ రద్దు చేయాలని ప్రధాని మోడీకి తాను పోస్ట్ కార్డు రాస్తానని, నేత కార్మికులంతా కూడా రాయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ బీఏంఆర్ సార్థ కన్వెన్షన్​లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ చివరలో శాసనమండలి మాజీ చైర్మన్ ​స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్​ టీఆర్ఎస్​లో చేరారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేతల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే, కేంద్రం మాత్రం ఉన్న ప్రయోజనాలు కూడా రద్దు చేస్తున్నదని ఆరోపించారు. నారాయణ్ పేటలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చి ఆరేండ్లు అయిందని, కానీ ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. అలాగే ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్, మహాత్మా గాంధీ భుంకర్ బీమా రద్దు చేసి చేనేతలకు కేంద్రం తీరని నష్టం చేసిందని విమర్శించారు. టెక్స్​టైల్ ఇండస్ట్రీలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కంటే కూడా భారత్ ఎందుకు వెనకబడిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం అని చెప్పారు. దానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజల అందరిదన్నారు. 

టీఆర్​ఎస్​లోకి స్వామి గౌడ్, శ్రవణ్

శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్​లో చేరారు. టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత కేటీఆర్​ మాట్లాడుతూ.. స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని పేర్కొన్నారు. వీరిద్దరూ సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ రావాలని గట్టిగా కొట్లాడినం: స్వామిగౌడ్ 

తెలంగాణ రావాలని ఉద్యమంలో గట్టిగా కొట్లాడామని ఆనాటి సందర్భాలను స్వామి గౌడ్ గుర్తు చేసుకున్నారు. అందరి పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతోనే బీజేపీలో చేరానని, కానీ ఏ ఆశయం కోసం పార్టీలో చేరానో అవి నెరవేరడం లేదని అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగే లీడర్ కేసీఆర్‌‌ మాత్రమేనని ఆయన నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు.

రాష్ట్రం దేశానికి తలమానికం: దాసోజు శ్రవణ్

అనాలోచిత నిర్ణయాల వల్ల 8 ఏండ్ల కింద టీఆర్ఎస్ ను వీడానని దాసోజు శ్రవణ్ అన్నారు. మళ్లీ ఇప్పుడు సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లానని, అందులో కొందరు నాయకులు మూస రాజకీయాలు చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్‌‌ తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారని అన్నారు. నవ భారత నిర్మాణం కోసం ఉడుతా భక్తిగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా తెలిపారు. చివరిశ్వాస ఉన్నంత వరకూ కేటీఆర్​కు అండగా ఉంటానన్నారు.

నేతన్నలకు రుణ మాఫీ చేస్తం

సీఎం కేసీఆర్​కు నేత కార్మికుల కష్టాలపై పూర్తి అవగాహన ఉందని.. అందుకే ఈ ఎనిమిదేండ్లలో వారికి రూ.5752 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పారు. త్వరలో చేనేత బీమా తీసుకువస్తున్నామన్నారు. చేనేత కార్మికుల డిజైన్లను ఎవరూ కాపీ కొట్టకుండా చట్టాలను కఠినంగా మార్చుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం చేనేత మిత్ర కింద 40 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ఎవరైనా కార్మికులకు బకాయిలు వెంటనే విడుదల అయ్యేలా చూస్తామన్నారు. గతంలో నేతన్నకు లక్ష రూపాయలు వరకు రుణ మాఫీ చేశామన్నారు. మళ్లీ కూడా చేస్తామన్నారు. పద్మశాలీలకు కోకాపేట్ లో పద్మశాలి ఆత్మగౌరవ భవనాన్ని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.