Nithyanandha: వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రాణాలతో లేడా..? చనిపోయి రెండ్రోజులు అయిందా..?

Nithyanandha: వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రాణాలతో లేడా..? చనిపోయి రెండ్రోజులు అయిందా..?

వివాదాస్పద స్వామి నిత్యానంద చనిపోయాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిత్యానంద రెండు రోజుల క్రితం మరణించినట్లు తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశాడని అతని మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పారని, ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశారని తమిళ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. నిత్యానంద మేనల్లుడు విడుదల చేసిన వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సినీ నటి రంజితతో రాసలీలలు సాగించిన వీడియో బయటకు రావడంతో నిత్యానంద వివాదంలో చిక్కుకుని అప్పట్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్తో పాటు దేశంలోని 41 ప్రాంతాల్లో నిత్యానంద ఆశ్రమాలు ఉన్నాయి. సెక్స్ స్కాండల్ కేసులో ఇరుక్కుని నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత హిందువుల కోసం ‘కైలాస’ అనే ఒక ప్రత్యేక దేశం సృష్టించానని, అక్కడే ఉంటున్నానని.. భక్తులు ఆహ్వానితులేనని.. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిత్యానంద ఒక వీడియో విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

దేశం విడిచే కాదు ఆసియా ఖండాన్నే విడిచి పారిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతంలో ‘కైలాస’ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. నిత్యానంద చనిపోయినట్లు గతంలో కూడా వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది. నిత్యానంద తన యూ ట్యూబ్ ఛానల్లో చివరిగా శివరాత్రి రోజు కనిపించినట్లు తెలిసింది.

చనిపోయినట్లు నాటకం ఆడి పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకు నిత్యానందే స్వయంగా ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నాడనే వాదన కూడా ఉంది. ఒక వేళ నిత్యానంద నిజంగానే చనిపోయి ఉంటే.. అతని 4 వేల కోట్ల ఆస్తులు ఎవరికి దక్కుతాయనే ప్రశ్న తలెత్తింది. ఈ ఆస్తిని చేజిక్కునే జాబితాలో రంజిత ముందు వరుసలో ఉండగా మరో నలుగురు కూడా పోటీ పడే అవకాశం లేకపోలేదు.