జీవుల సేవే పరమావధిగా..రామకృష్ణ మఠం కార్యక్రమాలు:స్వామి విశ్వాత్మానంద

జీవుల సేవే పరమావధిగా..రామకృష్ణ మఠం కార్యక్రమాలు:స్వామి విశ్వాత్మానంద

హైదరాబాద్: శివజ్ణానే జీవసేవ.. ప్రతి జీవిలోనూ శివుడు ఉన్నాడని భావిస్తూ సేవ చేయాలని బనారస్ రామకృష్ణ అద్వైత ఆశ్రమ అధ్యక్షుడు స్వామి విశ్వత్మానంద తెలిపారు. సేవతో వ్యక్తిగతంగాను సామాజికంగానూ  దివ్యత్వాన్ని సాధించేలా రామకృష్ణ మఠం, మిషన్ సేవలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికరించి పున:ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హెచ్ఆర్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సభ్యుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సేవా ఎలా చేయాలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివేకానంద ఆరోగ్య కేంద్రాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుందన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం లో కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా సమాజ కల్యాణానికి పాటుపడడాన్ని టీమిండియాతో పోల్చారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే వివేకానంద కలలు కన్న విశ్వగురు స్థానాన్ని భారత్ తిరిగి చేరుకోగలదని ఆయన చెప్పారు. 

హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. వివేకానంద హెల్త్ సెంటర్ ద్వారా జరుగుతున్న సేవలను ప్రస్తావించారు. 1981లో  రామకృష్ణ మఠం, మిషన్ సర్వాధ్యక్షులు స్వామి రంగనాథానంద ఆధ్వర్యంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వివేకానంద హెల్త్ సెంటర్ ప్రారంభించారని గుర్తు చేశారు.ప్రస్తుతం రోజుకు 700 మంది రోగులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి జ్ఞానదానంద, ఆరోగ్య భారతి వ్యవస్థాపకుడు డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆర్య జనని ఇన్చార్జ్ డాక్టర్ అనుపమ రెడ్డి, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.