వివేకానంద జయంతి : ఆధునిక యుగ ఆధ్యాత్మికవేత్త

వివేకానంద జయంతి :  ఆధునిక యుగ ఆధ్యాత్మికవేత్త

ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్త, మార్గదర్శకుడు, అసమాన ప్రతిభాపాటవాలు గల వక్త వివేకానందుడు. యువశక్తికి నిత్యం ప్రేరణ కలిగించే మహనీయుడుగా ఆయన ప్రపంచ దేశాల మన్ననలను పొందారు. వివేకానందుడు 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరిదేవిలకు జన్మించాడు. చిన్నతనంలో నరేంద్రనాథ్ దత్త గా పిలువబడి రామకృష్ణ పరమహంస శిష్యరికంలో వేదాంత, యోగ, తత్త్వ శాస్త్రములలో పారంగతుడై, సమాజంపై అత్యంత ప్రభావాన్ని చూపారు. ఆధ్యాత్మిక నాయకుడిగా వివేకానందగా మారారు. 

గురువు రామకృష్ణ పరమహంస మరణానంతరం భారతదేశ పర్యటనలో అనేక విషయాలపై అధ్యయనం చేశారు. దేశ కాలమాన పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. వివేకానందుడు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియచేయాలని సంకల్పించారు. అందులో భాగంగా అమెరికా, చికాగో మహానగరంలో అడుగుపెట్టారు. 1893 సెప్టెంబర్ 11న విశ్వమత మహాసభలలో వివేకానంద ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుడిని, సరస్వతీ దేవిని ప్రార్థించారు. పరమ పవిత్రమైన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనతో "నా అమెరికా దేశ ప్రియ సోదర సోదరీమణులారా!" అని స్వామీజీ తన మధుర కంఠస్వరంతో ప్రారంభించగా సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది.

 అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన  ప్రసంగించాక చెవులు చిల్లులుపడే శబ్దంతో హర్షధ్వానాలు దద్దరిల్లేవి. అనతికాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని వివరించేవాడు.  హిందూ మత విశిష్టతను చక్కగా తెలపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు. అటువంటివారు యుగానికి ఒకరే పుడతారు. 

జీవుడే దేవుడు

వివేకానందుడు గొప్ప తాత్వికుడు.  ఆయన బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రంలోనే కాకుండా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రంగా మారింది. 'దరిద్ర నారాయణ దేవోభవ' 'మూర్ఖ దేవో భవ' అని పేదవారిని, రోగులను నారాయణుడితో పోల్చుతూ వారిని సేవించమని, మూర్ఖులకు అండగా నిలవమని, కుల, మత, వర్ణ, లింగ, జాతి, భాష, ప్రాంతీయ భేదాలన్నింటినీ పటాపంచలు చేసి మనిషిని మనిషిగా చూడాలనే సంఘ సంస్కర్త, సమాజ సేవకుడు వివేకానంద. 

‘విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనం మనని గొప్పవారమని, తక్కువవారమని ఎలా అనుకుంటాం?’ అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్ష సమయంలో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షంపై వ్యామోహంను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయం అని నమ్మిన మహా మనీషి.  రామకృష్ణ మిషన్ ను ‘వ్యక్తి వికాసం, ప్రపంచ హితం, విద్య, సమాజ సేవ, ఆధ్యాత్మిక విలువలను’ సమాజంలో పెంపొందించడానికి స్థాపించారు. 

మనుషులుగా ఎదగండి

ప్రస్తుత సమాజంలో యువత ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక అస్తవ్యస్త జీవనశైలితో పెడదోవ తొక్కుతున్నది.  యువత చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించుకుని ఆత్మన్యూనతా భావం, నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్టించడాన్ని వివేకానందుడు ఒక యజ్ఞంలా చేశారు.  ‘మీ శరీరాన్ని, బుద్ధిని, ఆధ్యాత్మికతను బలహీనపరిచే దేన్నైనా విషంలా తిరస్కరించండి. బలమే జీవనం  బలహీనతే మరణం. దేనికీ భయపడకండి. మీరు అద్భుతాలను సాధించగలరు.

 భయపడిన మరుక్షణం ఎందుకూ పనికిరాని వారవుతారు. మనకు కావలసింది బలం, కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలను దృఢతరం చేసుకోండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. విలపించినది ఇకచాలు, మీ కాళ్లపై మీరు నిలబడి మనుషులుగా ఎదగండి,  లేవండి.. మేల్కొండి. గమ్యాన్ని చేరుకునే వరకూ ఆగకండి’ అని వివేకానంద యువతను జాగృతపరిచిన తీరు అమోఘం. అందుకే ఆ మహనీయుడి జన్మదినం జనవరి 12 ను భారత ప్రభుత్వం 1984లో ‘జాతీయ యువజన దినోత్సవం’గా ప్రకటించింది. మనం 1985 నుంచి వివేకానంద జయంతిని ‘జాతీయ యువజన దినోత్సవం’గా  జరుపుకుంటున్నాం. 

- డా. శ్రీశైలం వీరమల్ల,అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇగ్నో, ఢిల్లీ