హైదరాబాద్ సిటీ, వెలుగు: భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనదే కాక.. నిత్య నూతనమైనదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డా. వినయ్ సహస్రబుద్ధే చెప్పారు. రామకృష్ణ మఠంలో ఆదివారం నిర్వహించిన స్వామి రంగనాథానంద 116వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఇండియన్ కల్చర్ అండ్ ఇట్స్ సాఫ్ట్ పవర్ స్ట్రెంత్’ అంశంపై ప్రసంగించారు.
సర్వ మానవ, ప్రాణకోటి శ్రేయస్సు కోరుకునే భారత్ అనాదిగా విశ్వానికి మిత్రుడిలా ఉందన్నారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికం ప్రపంచానికి భారత్అందించిన వరాలు అని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం తొలి అధ్యక్షుడిగా, రామకృష్ణ మఠం, మిషన్ 13వ సర్వాధ్యక్షుడిగా స్వామి రంగనాథానంద తన పనితీరు, వ్యక్తిత్వంతో లక్షలాది మందికి స్ఫూర్తినివ్వడమే గాక రామకృష్ణ మఠం చరిత్రలో శాశ్వత ముద్ర వేశారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన రామకృష్ణ మఠం శాఖల స్వాములు, భక్తులు, వలంటీర్లు పాల్గొన్నారు.