
దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. తమ అభిమాన ప్లేయర్ ఆటకోసం.. అభిమాన టీమ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడటం లేదు. దేశ వ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్ జరుగుతున్నా చూసేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. దొరకని పక్షంలో బ్లాక్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నిట్ట నిలువునా దోచుకుంటున్నారు.
ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్ కే ఇస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఏప్రిల్ 23న సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే సోల్డ్ అవుట్ అయిపోయాయి. చాలామంది అభిమానులు టికెట్లు దొరకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఇదే అదునుగా చేసుకున్న సైబర్ ఫ్రాడ్స్టర్లు అభిమానుల ఆశను దోచుకునే పనిలో పడ్డారు. సోషల్ మీడియాలో ఐపిఎల్ టికెట్ల విక్రయం పేరుతో కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేశారు. ఈ పేజీల ద్వారా టికెట్లు కావాలంటే సంప్రదించాల్సిందిగా కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందులో ప్రచురించారు. ఇది నిజమేమో అనుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నంబర్ తో చాట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రూ.3,500 ఉన్న ఐపిఎల్ టికెట్ కు డిస్కౌంట్ కూడా ఇస్తామని అభిమానులను నమ్మిస్తున్నారు.
►ALSO READ | ఉప్పల్ స్టేడియం స్టాండ్‌కు అజరుద్దీన్ పేరు తొలగించండి.. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ ఆదేశం
రెండు టికెట్లు అయితే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుందని, కావాలంటే క్యూఆర్ కోడ్ కి డబ్బులు చెల్లించాల్సిందిగా నమ్మిస్తున్నారు. క్రికెట్ మీద ఆశతో నిజంగానే టికెట్లు వస్తాయేమో అని ఆశపడుతున్న అభిమానులకు చివరిగా నిరాశ మిగులుతోంది. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్కాన్ చేసి ఆ స్క్రీన్ షాట్ ను సంబంధిత వాట్సాప్ నెంబర్ కు పంపిన తర్వాత ఆ నంబర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు.
ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కత్తా, ముంబై, చెన్నై లాంటి జట్లు ఆడే మ్యాచ్ లకు ఫ్యాన్స్ క్రేజీ విపరీతంగా ఉన్నతరణంలో ఆన్లైన్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. టికెట్లను కేవలం డిస్ట్రిక్ట్ బై జొమాటో, బుక్ మై షో యాప్ లో మాత్రమే కొనుక్కోవాల్సిందిగా అభిమానులకు పోలీసుల సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలు చూసి మోసపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రకటనలు చూస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు.