ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు : మంత్రి తలసాని

సికింద్రాబాద్ స్వప్న లోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుంచి మంత్రి తలసాని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. 

అన్ని కోణాల్లో దర్యాప్తు

స్వప్న లోక్ అగ్నిప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సిటీలో దాదాపు 30 నుంచి 40 లక్షల వరకూ అక్రమంగా కట్టిన బిల్డింగులు ఉన్నాయని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ నడుస్తోందన్నారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత ప్రభుత్వ అంబులెన్సుల్లోనే వారి సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తరలిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన స్వప్న లోక్ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. 

అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని చెప్పారు. తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులను హెచ్చరిస్తున్నామని... అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమందిని రెస్క్యూ ఫైర్ సిబ్బంది కాపాడారని చెప్పారు. ఆరుగురు మాత్రం 5వ అంతస్తులోనే చిక్కుకోవడంతో ఊపిరి ఆడక పొగ పీల్చుకుని.. చనిపోయారని చెప్పారు. చనిపోయిన వారు క్యూనేట్ అనే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. క్యూనేట్ సంస్థపైనా చాలా ఫిర్యాదులు సైతం ఉన్నాయన్నారు. ప్రభుత్వ సహాయంతో పాటు క్యూనెట్ నుండి మృతుల కుటుంబ సభ్యులకు సాయం అందేలా చూస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. 

‘అగ్ని ప్రమాదాలు 40 ఏళ్ల నాటి పాపం. పాత బిల్డింగులు, ఫైర్ సేఫ్టీ లేని భవనాలు హైదరాబాద్ లో సుమారుగా 30 నుంచి 40 లక్షల వరకూ ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలంటే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ తెగించి.. బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది’ అని చెప్పారు.