Swapnil Kusale: ఒలింపిక్స్‌లో మెడల్.. శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వేస్ 

Swapnil Kusale: ఒలింపిక్స్‌లో మెడల్.. శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వేస్ 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. పురుషుల 50మీ. ఎయిర్ రైఫిల్‌ షూటింగ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచిన కుసాలే దేశానికి మూడో పతకాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ సంస్థ తమ ఉద్యోగికి పదోన్నతి కల్పించి గౌరవించింది.   

ప్రస్తుతం స్వప్నిల్ కుసాలే సెంట్రల్ రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ అనంతరం అతనికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పదోన్నతి కల్పించారు. "జూనియర్ స్కేల్/గ్రేడ్ బి మెకానికల్ డిపార్ట్‌మెంట్ నుంచి ముంబై హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న స్పోర్ట్స్ సెల్ ఓఎస్‌డీగా కుసాలేను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం" అని సెంట్రల్ రైల్వేస్ ఆర్డర్ లో వెల్లడించింది. అయితే, తొమ్మిదేళ్లుగా టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్న కుసాలేకు ఈ ప్రమోషన్ ఆశ్చర్యం కలిగించలేదట. ఈ విషయాన్ని అతని కోచ్ దీపాలి దేశ్‌పాండే మీడియాకు వెల్లడించారు.

తొమ్మిదేళ్లుగా..

2015లో సెంట్రల్ రైల్వేలో చేరిన కుసాలే పదేపదే కోరినప్పటికీ పదోన్నతి పొందలేదు. ప్రమోషన్ కోసం ఎన్నడూ పరిగణించబడలేదు పైఅధికారుల తీరుతో అతను చాలా నిరాశ చెందాడు. ఇప్పుడు ప్రమోషన్ రావడం అతనికి సంతోషాన్ని ఇవ్వదు అని అతని కోచ్ దీపాలి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, కుసలే ప్రమోషన్ ఆలస్యం అయిందన్న కోచ్ వాదనలను సెంట్రల్ రైల్వే అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ రెంజిత్ మహేశ్వరి తోసిపుచ్చారు. రెండు రోజుల్లో అతనికి డబుల్ ప్రమోషన్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు లభించిన మూడు పతకాలు షూటింగ్ ఈవెంట్‌ల నుంచే వచ్చాయి.