ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీనటీ స్వరాభాస్కర్ సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై తన అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనభర్త..ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్ ఓటమికి ఈవీఎంలే కారణం అని ఆరోపించారు. కొన్ని ఈవీఎంలలో ఫుల్ ఛార్జింగ్ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
శనివారం వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అణుశక్తి నగర్ అసెంబ్లీ స్థానం ఫలితాలపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు సినీ నటి స్వరాభాస్కర్. తన భర్త, ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్.. ప్రత్యర్థి ఎన్సీపీ (అజిత్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో కేవలం 3వేల 378 ఓట్లతో తేడా ఓడిపోయారని..దీనికి ఈవీఎంలే కారణమని ఆమె ఆరోపించారు.
99శాతం ఛార్జింగ్ ఉన్న ఈవీఎం లన్నింటోనూ సనా మాలిక్ ఆధిక్యంలో ఉన్నారు. తక్కువ ఛార్జింగ్ ఉన్న ఈవీఎంల్లోనేమో సనా వెనకబడ్డారు. ఇదెలా సాధ్యం అని అభ్యర్థి అహ్మద్ ప్రశ్నించారు. ఆయన భార్య సినీ నటి స్వరాభాస్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
177 రౌండ్ల దాకా నా భర్తే ఆధిక్యం ఉన్నారు. కానీ చివరి మూడు రౌండ్లలో లెక్కించిన ఈవీఎంలన్నీ 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నవే..వాటన్నింట్లోనూ సనా మాలికే ఆధిక్యం ఉన్నారు. దీంతో ఫలితాలు తారుమారయ్యాయని స్వరా భాస్కర్ చెప్పారు.
“రోజంతా ఓటింగ్ ప్రక్రియ కొనసాగాక ఈవీఎం యంత్రాల్లో చార్జింగ్ తగ్గాలి. చాలా ఈవీఎంల్లో అలాగే తగ్గింది కూడా. కానీ కొన్ని ఈవీఎంల్లోనే, ప్రత్యేకించి చివరి మూడు రౌండ్లలో లెక్కించిన వాటి లోనే ఫుల్ చార్జింగ్ ఉంది. ఇదెలా సాధ్యం?" అని ఆమె ప్రశ్నించారు.