శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 8వ రోజైన ఆదివారం (అక్టోబర్ 22) ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప బంగారుతేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు. మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, పలువురు బోర్డు సభ్యులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.