
యాదగిరిగుట్ట, వెలుగు: గుట్ట ఆలయంలో దివ్యవిమాన స్వర్ణగోపుర ఆవిష్కరణకు 'పంచకుండాత్మక మహాకుంభాభిషేక సంప్రోక్షణ' మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. యాగశాలలో నిర్వహిస్తున్న 'పంచకుండాత్మక సుదర్శన నారసింహ యాగం' శనివారం నాలుగో రోజుకు చేరింది.
ఉదయం బంగారు కలశాలకు 'ఏకాశీతి కలశ స్నపనం'.. సాయంత్రం 'శయ్యాధివాసం', 'ఫల పుష్పాధివాసం'ను వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఇతర అర్చకులు నిర్వహించారు. యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇయ్యాల సీఎం రేవంత్ రాక
పంచతల బంగారు విమాన గోపురం ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వానమామలై రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో భాస్కర్రావు తెలిపారు.