నేడు యాదాద్రికి శారదా పీఠాధిపతి

నేడు యాదాద్రికి శారదా పీఠాధిపతి

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మంగళవారం రానున్నారు. ఆలయ సందర్శనకు రావాల్సిందిగా ఆయనను ప్రభుత్వ పెద్దలు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. స్వరూపానందేంద్రతోపాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వరూపానందేంద్ర మంగళవారం వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టు ఉదయం 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో 10.30కు యాదగిరిగుట్ట గెస్ట్ హౌస్‌‌‌‌కు చేరుకుంటారు. 10.45కు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. 11 గంటల నుంచి ఆలయాన్ని పరిశీలిస్తారు. 11:50కు యాదమహర్షి విగ్రహాన్ని సందర్శిస్తారు. అక్కడే మీడియాతో మాట్లాడి హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వెళ్తారు. యాదాద్రి పున:ప్రారంభం తర్వాత ఆలయాన్ని సందర్శిస్తున్న మొదటి పీఠాధిపతి స్వరూపానందేంద్రే కావడం గమనార్హం.

చిన జీయర్‌‌‌‌‌‌‌‌తో పొరపొచ్చాలు రావడంతోనే!

యాదగిరిగుట్ట ఆలయ పున: నిర్మాణానికి అంకురార్పణ నుంచి పున: ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించే దాకా అన్నింటా చిన జీయర్ స్వామి కీలకంగా వ్యవహరించారు. ముచ్చింతల్ ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో చిన జీయర్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్ దూరం పెట్టినట్టుగా ప్రచారం ఉంది. చిన జీయర్‌‌‌‌‌‌‌‌తో పాటు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ముందు నుంచి విశాఖ శారదా పీఠాధిపతితో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు పొరపొచ్చాలు రావడంతోనే చిన జీయర్‌‌‌‌‌‌‌‌ను దూరం పెట్టి, శారదా పీఠాధిపతిని ఆలయ సందర్శనకు రావాల్సిందిగా కేసీఆర్ సర్కారు ఆహ్వానించినట్టుగా సమాచారం.