పండిట్​ దీన్​దయాళ్ కృషితోనే.. స్వశక్తి భారత్​

విశ్లేషణ: మనమంతా మరణించే వరకు జీవిస్తాం.. కానీ కొందరు మాత్రమే వారి ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా మరణం తర్వాత కూడా సజీవంగా ఉంటారు. అలాంటి వారిలో పండిట్ దీన్​దయాళ్ ఉపాధ్యాయ కూడా ఒకరు. స్వశక్తి భారత్​ కోసం అలుపెరుగని కృషి చేసిన యోధుడాయన. దీన్ దయాళ్​ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావడమే ఆయనకు మనమిచ్చే నివాళి.

ఆర్​ఎస్ఎస్ పరిచయంతో మారిన గమ్యం
దీనదయాళ్​ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. 1916 సెప్టెంబర్‌‌‌‌ 25న ఉత్తరప్రదేశ్​లో జన్మించిన ఆయన.. కాన్పూర్‌‌‌‌లో బీఏ చదివారు. ఆ సమయంలోనే ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన జీవన విధానం, గమ్యం మారిపోయాయి. సంఘ్‌‌‌‌లో పనిచేస్తూనే ఉపాధ్యాయ శిక్షణ, ఎంఏ మొదటి సంవత్సరం చదివారు. ఆ తర్వాత ఆర్థిక కారణాలతో చదువు ఆపేశారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని లభంపూర్‌‌‌‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియమితులైన ఆయన ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌‌‌‌ ప్రాంత సహ ప్రచారకులుగా పని చేశారు. సంఘ్‌‌‌‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌‌‌‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. దాని ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్‌‌‌‌ అనే దిన పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీన్​దయాళ్‌‌‌‌ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ పై కూడా మోపి ఆనాటి ప్రధాని నెహ్రూ సంఘ్‌‌‌‌ను నిషేధించారు. దాన్ని తొలగించాలంటూ ప్రారంభమైన ఉద్యమంలో దీన్​దయాళ్‌‌‌‌ కీలక పాత్ర వహించారు. హత్యానేరంలో సంఘ్‌‌‌‌ పాత్ర లేదని ‘పాంచజన్య’లో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం 
పాంచజన్యను కూడా నిషేధించింది. దానికి బదులుగా హిమాలయ అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో మళ్లీ విరుచుకుపడ్డారు. ఈలోగా గాంధీజీ హత్యానేరంలో ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్‌‌‌‌, చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా దీన్​దయాళ్‌‌‌‌ రాశారు.

ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం..
1962లో చైనా భారత ఉత్తర, ఈశాన్య సరిహద్దులను అతిక్రమించి లోపలికి చొచ్చుకు వచ్చింది. దురాక్రమణలను నిలువరించటంలో ప్రభుత్వం విఫలమైంది. లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా ఉన్నపుడు పాకిస్తాన్ గుజరాత్ లోని కచ్​లోకి చొచ్చుకొని వచ్చింది. అప్పుడు భారతీయ జన్ సంఘ్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న దీన్​దయాళ్ ఉపాధ్యాయ దేశాన్ని ఆశావహ దిశలో నడిపించే వ్యూహరచన చేశారు. కచ్ విషయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి నిరసనగా భారతీయ జన సంఘ్​ ఆయన ఆధ్వర్యంలో1965 ఆగస్టు16 న ఆందోళన నిర్వహించింది. ఆరోజు జరిగిన ఆందోళనల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 5 లక్షలమంది నిరసనలో పాల్గొన్నారు. ఇలా జనసంఘ్ నిర్వహించిన జాతీయ స్థాయి, స్థానిక ఉద్యమాల్లో కనిపించే మూలాలు.. జన సంపర్కం, జన ఆందోళన, జన జాగరణ. అఖిల భారత స్థాయిలో జన సంఘ్ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ‘‘నాతో పాటు ఇద్దరు దీన్ దయాళ్ ఉపాధ్యాయలు ఉంటే చాలు భారతదేశపు రాజకీయ స్వరూపాన్ని మార్చి వేయగలను” అనే డాక్టర్​శ్యాంప్రసాద్ ముఖర్జీ మాటలు దీన్​దయాళ్​ఉపాధ్యాయ ఔన్నత్యాన్ని తెలుపుతాయి. అఖిలభారత అధ్యక్షుడిగా పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్న ఆయన1968 ఫిబ్రవరి11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ప్లాట్​ఫాంపై విగతజీవిగా మిగిలారు. 

ఆచరణలో ఆయన సిద్ధాంతాలు
ప్రస్తుత భారత ప్రభుత్వం ఆర్థిక, రాజకీయ విధానాల్లో దీన్​దయాళ్​ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యుమానిజం సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిస్తోంది. ఆయన థియరీ ప్రకారమే అనేక పథకాలు రూపొందుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం, ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాళ్​ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్​మెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దీన్​దయాళ్​ఆలోచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆత్మనిర్బర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా పట్టణాల రహదారుల నుంచి అన్ని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడంతో అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు, 
ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం..‘బేటీ బచావో బేటి పడావో’ నినాదంతో పథకం తెచ్చింది. బాలికల కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ స్కీంను కూడా ప్రారంభించింది. ఇలా అనేక పథకాలు దీన్ దయాళ్​ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెడుతున్న భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తోంది. అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే విధంగా కృషి చేయడం, వారిని వృద్ధిలోకి తీసుకురావడమే దీన్​దయాళ్ ఉపాధ్యాయకు దేశం ఇచ్చే ఘన నివాళి.

ఇంటిగ్రల్​ హ్యామానిజం
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్​ హ్యుమానిజం(ఏకాత్మ మానవ వాదం) అనే తాత్విక సిద్ధాంతం చెప్పారు. వ్యక్తికి సమాజంకు మధ్య గల సంబంధాన్ని ఆయన విశ్లేషించారు. మనిషి అంటే కేవలం శరీరం కాదని, ఆకలి ఒక్కటే అతని సమస్య కాదని వివరించారు. మనిషికి శరీరంతో పాటు మనస్సు, బుద్ధి, ఆత్మ ఉంటాయని, వాటి అవసరాలను తీర్చటం, వాటి రకరకాల కోరికలు, ఆకాంక్షలను తృప్తిపరచటం, వాటి వికాసం కోసం ధర్మ, అర్థ, కామ, మోక్ష నాలుగు పురుషార్థాల ద్వారా మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆయన సిద్ధాంతంలో పేర్కొన్నారు. మనిషితోపాటు దేశానికీ నాలుగు అంశాలు ఉంటాయని తెలిపారు. ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మ ఉందని చెప్పారు. మనుషుల పనులు, సేవల ద్వారా సమాజం లబ్ధిపొందితే, ఆ సమాజం అందించే విజ్ఞానం, కళలు, వినోదాల నుంచి వ్యక్తి ప్రయోజనం పొందుతాడని ఆయన వ్యక్తికి, సొసైటీకి ఉన్న రిలేషన్​ తెలిపారు. దేశం అభివృద్ధి కోసం చేపట్టే ప్రణాళిక ఏదైనా అది ఆ దేశ పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఉండాలని సూచించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో వికేంద్రీకరణను కోరుకున్నారు. 

- శ్రీశైలం వీరమల్ల, రీసెర్చ్ స్కాలర్, ఓయూ