శ్రీలంక కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం.. ‘నేను మాంత్రికుడిని కాదు’

శ్రీలంక కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం.. ‘నేను మాంత్రికుడిని కాదు’

శ్రీలంకలో నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు సెప్టెంబర్ 23 (సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. మార్క్సిస్ట్ పార్టీ లీడర్ అనుర కుమార దిసానాయకే ఆ దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. సెప్టెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్ట్-లీనింగ్ నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అధినేతగా పోటీ చేసిన 55 ఏళ్ల దిసానాయకే మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను ఓడించాడు. 

శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఒంటరిగా పరిష్కరించుకోలేదని దిసానాయకే అన్నారు. ప్రమాణస్వీకరారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను మాంత్రికుడిని కాదు.. సాధారణ పౌరుడిని అని ముందే చెప్పాను. నాకు తెలిసినవి, తెలియనివి ఉన్నాయి. ఈ దేశాన్ని ఉద్ధరించడానికి విజ్ఞానం మరియు నైపుణ్యాలు ఉన్నవారిని సేకరించడమే నా లక్ష్యం.’ అని ఆయన అన్నారు. 

ALSO READ | US Elections 2024: ఓడిపోతే మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయను

చైనా, భారత్, మాల్దీవ్ దేశాలకు చెందిన నాయకులు సోమవారం దిసానాయకేకు అభినందనలు తెలిపారు. శ్రీలంక తన జాతీయ స్థిరత్వం, అభివృద్ధిని కొనసాగించాలని చైనా భావిస్తోందని.. సాఫీగా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం తెలిపారు.

2000లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన దిసానాయకే అప్పటి అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ఆధ్వర్యంలో వ్యవసాయం మరియు నీటిపారుదల శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. 2019లో తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ చేసి రాజపక్సే చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2024లో రణిల్ విక్రమసింఘేపై అధ్యక్ష పోటీలో గెలిచారు.

శ్రీలంక దేశంలో 2022 సంవత్సరంలో ఆహారాలు, మందులు, వంటగ్యాస్ మరియు ఇంధనం వంటి నిత్యావసరాల కొరత ఏర్పడింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంది. ప్రజలు నిరసనలు చేయడంతో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయాడు.