స్వీడన్​ ‘నాటో’లో  చేరుతుందా?

స్వీ డన్ యూరోప్​లో నాలుగో పెద్ద దేశం. ఇక్కడ రాజ్యాంగబద్ధ రాజరికం ఉంది.1434 నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. చాలా సంవత్సరాల నుంచి రాగి, ఇనుము ఇతర ఖనిజాలను ఎగుమతి చేస్తూ గణనీయమైన ఆదాయం పోగు చేసుకుంది. అయితే నాటోలో చేరడానికి  స్వీడన్ లో  సంకేతాలు  వచ్చినప్పటి నుంచి ఆ దేశంలోని పలు నగరాలు తీవ్ర నిరసనలతో దద్దరిల్లిపోతున్నాయి. ప్రభుత్వం నాటోలో చేరడానికి సుముఖంగా ఉన్నప్పటికీ, ఆ దేశ ప్రజలు విముఖంగా ఉన్నారు. అందుకే  దేశంలోని దాదాపు18 నగరాల్లో నిరసన కార్యక్రమాలు చెలరేగుతున్నాయి. ‘నాటో అనేది ఒక దుష్ట కూటమి, అది రక్షణాత్మక వ్యవస్థ కాదు. నాటో అనేది అగ్రదేశం యుద్ధ తంత్రంలో ఓ భాగం.

ఆ చట్రంలో ఇరుక్కోకూడదు. నాటోలో చేరిన దేశాలన్నిటినీ  అగ్రదేశం తన గుప్పిట్లో ఉంచుకోవాలని కోరుకుంటోంది, ఆధిపత్యం చూపిస్తుంది’’ అంటూ ఆందోళనలు చేస్తున్నారు. స్వీడన్ ఎప్పుడూ శాంతి కాముక దేశం. స్వీడన్ లో ఆయుధాలు తక్కువ. ఇటీవల స్వీడిష్ ఆర్బీట్రీషన్ సొసైటీ వాళ్లు ‘నో నాటో, నో నూక్లియర్ వెపన్స్’ అని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టగా అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తూ నిరసనలో పాల్గొన్నాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. ఇరు దేశాల్లో పౌరులు మరణించారు. అలాంటివి మాకు వద్దు. నాటో యుద్ధం కోసం మా పిల్లలను బలి చేయలేం, నాటో మాకు వద్దు అని ప్లకార్డ్స్, బ్యానర్లు పట్టుకుని పౌరులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. 

అణ్వాయుధాలతో భయం

స్వీడన్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు క్రిస్టర్ హుల్మ్ సహా చాలా మంది స్వీడన్ నాటోలో చేరకుండా తటస్థంగా ఉంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వీడిష్ ప్రజలు యుద్ధానికి వ్యతిరేకం, నాటో కు కూడా వ్యతిరేకమే. ఇప్పుడు స్వీడిష్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంది. నాటో యుద్ధ కూటమి అని హుల్మ్ అంటున్నారు. ఒక వేళ స్వీడన్ నాటో సభ్య దేశంగా ఉంటే విపత్కర పరిణామాలు ఉంటాయని, పన్ను చెల్లింపుదారులకు పన్నుల భారం మీద పడి ఖర్చు అధికం అవుతుంది. ఎందుకంటే దేశంలోని పౌరుల ఆరోగ్య సంరక్షణకు, విద్యావ్యవస్థకు నిధులు తక్కువ అవుతాయి. రక్షణ బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది అని హుల్మ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఇంకో భయం కూడా స్వీడన్​కు పట్టుకుంది. స్వీడన్ నాటో సభ్య దేశంగా మారితే అణ్వాయుధాలు, అణు సంపత్తి స్వీడన్ భూభాగంలో నిల్వ చేస్తారనే ఒకింత భయం ఆ దేశ వాసులను కలవర పెడుతున్నది. 

ఇప్పటికే ప్రకటించిన పార్లమెంట్

స్వీడన్ పార్లమెంట్ రిక్స్ డాగ్ లో స్వీడన్ నాటోలో చేరితేనే మేలు అనే విషయం వినబడుతోంది. మరి స్వీడన్ నాటోలో చేరితే అక్కడి పరిస్థితులు ఏలా ఉంటాయో చెప్పలేం. నాటోలో చేరాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హుల్మ్ అంటున్నారు. పార్లమెంట్ తప్పుడు నిర్ణయం దేశ భవిష్యత్​ను అంధకారంలోకి నెడుతుందని, చీకటి నుంచి బయట పడి స్వీడన్ ప్రజల అభివృద్ధికి, సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అయితే స్వీడన్ పార్లమెంట్ రిక్స్ డాగ్ నాటోలో స్వీడన్ చేరుతుందని, గత మార్చి 22 న స్వీడన్ నాటోలో సభ్య  దేశం అని ప్రకటించింది. ఈ పరిణామాలు ఇక ముందు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 
- కనుమ ఎల్లారెడ్డి,