ఎయిర్ హోస్టస్ తో అసభ్య ప్రవర్తన.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్

ఎయిర్ హోస్టస్ తో అసభ్య ప్రవర్తన.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్

ఇండిగో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని   ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న విమానంలో   క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌ అనే వ్యక్తి  ఎయిర్ హోస్టస్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదుతో మార్చి 31న  ముంబైలో దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.   

భోజనం కొనుగులో చేసే సమయంలో జోనాస్ వెస్ట్‌బర్గ్‌  పేమెంట్ చేయడానికి కార్డు స్వైప్ చేస్తుండగా ఎయిర్ హోస్టస్ చేయిని పట్టుకున్నాడు. ఎయిర్ హోస్టస్ నిరసన తెలపడంతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలో దిగగానే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు  కోర్టులో హాజరుపరిచారు.

అయితే అతను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. శరీరం వణుకుతోందని నిందితుడి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.  అతను సహాయం లేకుండా ఏమీ పట్టుకోలేడని చెప్పిన లాయర్..ఎయిర్ హోస్టెస్ ను ఉద్దేశపూర్వకంగా తాకలేదని చెప్పారు. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ అతనికి  బెయిల్ మంజూరు చేసింది.  గత 3 నెలల్లో భారత విమానాల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఇది ఎనిమిదోసారి.