- గ్రేటర్ లో వర్షాలు పడ్డప్పుడు పార్కింగ్ లోంచి కదలవు
- రోడ్లపై వరదనీరు నిలిచినా సాఫ్ చేసే పరిస్థితి ఉండదు
- మెషీన్ కు రోజూ రూ.31 వేలు అద్దెగా ఇస్తున్న బల్దియా
- రాత్రిపూట పనులు చేస్తుండగా పర్యవేక్షించని అధికారులు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో రోడ్లను ఊడ్చే స్వీపింగ్ మెషీన్లు పని చేయని రోజుల్లోనూ ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తున్నారు. వర్షాలు పడినప్పుడు రోడ్డెక్కకున్నా పని చేసినట్టుగా చూపుతూ బిల్లులు ఇస్తున్నారు. దీంతో బల్దియా ఖజానాకు గండికొడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో మొత్తం 35 స్వీపింగ్ మెషీన్లు ఉన్నాయి. ఇందులో17 బల్దియావి, మిగతా18 అద్దెకు తీసుకుంది. వీటిలో ఏజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి రూ. 1 కోటి13 లక్షలకుపైగా బల్దియా చెల్లిస్తుంది. ఇలా ప్రతి ఏటా రూ. 20 కోట్ల 40 లక్షల ఖర్చు చేస్తోంది.
ఒక్కో మెషీన్ కు రోజువారీగా రూ.31 వేలు రెంట్ గా ఇస్తుంది. అయితే.. మెషీన్లు పనిచేయని రోజు బిల్లు ఇవ్వాల్సిన అవసరంలేదు. వర్షాలు పడ్డప్పుడు రోడ్డు క్లీన్ చేసే పరిస్థితులు కూడా ఉండవు. రోడ్లపై వరద నీరు ఉంటే మెషీన్లు రోడ్డెక్కవు. గతేడాది భారీ వర్షాలు కురిసిన సమయాల్లోనూ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించారు. వానలు పడిన రోజుల్లో పనులు చేయకుండానే చేసినట్లు చూపుతూ అధికారులు బిల్లులు అందజేస్తున్నారు. దీనిని ఉన్నతాధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో బల్దియా నిధులు పక్కదారి పడుతున్నాయి.
పనితీరు పర్యవేక్షించాల్సి ఉండగా..
సొంత వాహనాలతో పాటు ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకున్న స్వీపింగ్ మెషీన్ల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. డీజిల్ ఎంత వాడుతున్నారనే లెక్కలు లేవు. అద్దెకు తీసుకున్న వాటికి జోనల్ స్థాయిలోనే బిల్లులు అవుతుండగా ఇష్టానుసారంగా చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి వివరాలు సేకరించకుండానే బిల్లులను ఏజెన్సీలకు ఇస్తున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు రోడ్లు క్లీన్ చేయకుండానే బిల్లులు చెల్లిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది వర్షాకాలంలో ఎల్ బీనగర్ జోన్లో ఇదే విధంగా చాలా రోజుల బిల్లులు మంజూరు చేయడం ఇందుకు నిదర్శనం. ఇక్కడే కాకుండా అన్ని జోన్లలో వర్షాలు పడిన సమయంలో బిల్లులు ఇచ్చారు. మరోవైపు స్వీపింగ్ మెషీన్ల పనితీరుపై బల్దియా కమిషనర్ కి కార్పొరేటర్లు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటితో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ప్రజాధనాన్ని వృథా చేయొద్దని సూచిస్తున్నారు. అద్దెకి తీసుకున్న వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
రాత్రివేళలో పని చేస్తుండగా..
స్వీపింగ్ మెషీన్లు ఎక్కువగా రాత్రిపూటనే పని చేస్తున్నాయి. పగలు ట్రాఫిక్ కారణంగా రోడ్లను క్లీన్ చేసేందుకు వీలుండదు. అందుకే నైట్ పనులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాత్రంతా పనిచేస్తాయంటున్నారు. అయినా.. చాలా ప్రాంతాల్లో మెషీన్లు రోడ్లను క్లీన్ చేస్తున్నట్టు కనిపించడంలేదు. కొన్నిచోట్ల ఏదో నామ్ కే వాస్తే గా తిప్పుతున్నారే తప్ప రోడ్లు సాఫ్ కావడంలేదు.
వీటి పనితీరును పర్యవేక్షించాలంటే రాత్రిపూట ఫీల్డ్ లో ఉండాల్సి ఉంది. నెలకోసారి కూడా మెషీన్లు పనిచేస్తున్నాయా..? లేదా అన్నది చూడటంలేదు. ఉన్నతాధికారులు కూడా చూసిచూడనట్లుగా వది లేస్తున్నారు. దీంతో స్వీపింగ్ మెషీన్లు పనిచేయని రోజుల్లో కూడా బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది.