స్వైటెక్‌‌‌‌ తీన్‌‌మార్‌‌‌‌.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌‌‌‌ సొంతం

స్వైటెక్‌‌‌‌ తీన్‌‌మార్‌‌‌‌.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌‌‌‌ సొంతం

పారిస్‌‌‌‌ :  వరల్డ్ నంబర్ వన్, పోలాండ్ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఇగా స్వైటెక్ వరుసగా మూడోసారి ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గెలిచి తీన్‌‌మార్ కొట్టింది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ 6–2, 6–1తో 12వ సీడ్‌‌‌‌ జాస్మిన్‌‌‌‌ పౌలిని (ఇటలీ)పై నెగ్గింది. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈ టైటిల్ ఖాతాలో వేసుకుంది.  జస్టిన్ హెనిన్‌‌‌‌ (2005–2007) తర్వాత పోలాండ్‌‌‌‌ తరఫున పారిస్‌‌‌‌లో వరుసగా మూడుసార్లు ట్రోఫీ నెగ్గిన తొలి మహిళగా23 ఏండ్ల స్వైటెక్ రికార్డులకెక్కింది. 2020, 22, 23లోనూ ఫ్రెంచ్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌ను సాధించిన స్వైటెక్‌‌‌‌ 2022లో యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ విన్నర్‌‌‌‌గానూ నిలిచింది. దీంతో మేజర్ ఫైనల్స్‌‌‌‌లో ఆమె రికార్డు 5–0గా ఉంది.

 కెరీర్‌‌‌‌లో తొలిసారి గ్రాండ్‌‌‌‌ స్లామ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఆడిన 28 ఏళ్ల పౌలిని..  టాప్ సీడ్ స్వైటెక్‌‌ జోరును తట్టుకోలేక రన్నరప్‌‌తో సరిపెట్టింది. 68 నిమిషాల పోరులో స్టార్టింగ్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌కు కొద్దిగా పోటీ ఇచ్చిన పౌలిని ఆ తర్వాత తేలిపోయింది. 1–2తో తొలి సెట్‌‌‌‌ మొదలుపెట్టిన స్వైటెక్‌‌‌‌ తర్వాతి పది గేమ్‌‌‌‌ల్లో తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ షాట్లతో చెలరేగింది. ఇక రెండో సెట్‌‌‌‌లో పూర్తి ఆధిపత్యం ఆమెదే. బలమైన సర్వీస్‌‌‌‌లతో పౌలిని కట్టడి చేసి 5–0 లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. ఆరో గేమ్‌‌‌‌లో పౌలిని సర్వీస్‌‌‌‌ కాపాడుకున్నా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఈ గెలుపుతో స్వైటెక్‌‌‌‌ రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లో తన వరుస విజయాల రికార్డును 21కి పెంచుకుంది. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ నేడు
అల్కరాజ్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌) X జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ)  సా. 6 నుంచి