న్యూఢిల్లీ : దలాల్స్ట్రీట్ఈవారం ఐపీఓలతో బిజీగా ఉండనుంది. మొత్తం ఐదు కంపెనీలు తమ పబ్లిక్ ఆఫర్లను మార్కెట్లకు తీసుకువస్తున్నాయి. ఇన్వెస్టర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్విగ్గీతోపాటు ఆక్మే సోలార్ హోల్డింగ్స్, సాగిలిటీ ఇండియా, నివాబూపా, నీలమ్ లినెన్స్ఐపీఓలు మొదలవుతున్నాయి. అయితే వీటిలో నీలమ్ లినెన్స్ఎస్ఎంఈ విభాగంలో లిస్ట్ అవుతుంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ఫ్లాగ్షిప్ కంపెనీ అఫ్కాన్స్ ఇన్ఫ్రా ఇదేవారం లిస్ట్ కానుంది.
దీనికి కేవలం 2 రెట్ల కంటే కొద్దిగా ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. మరో 26 కంపెనీలు 72వేల కోట్ల రూపాయలను సమీకరించడానికి త్వరలో ఐపీఓలకు రానున్నాయి. ఇవి సెబీ పర్మిషన్‌కోసం దరఖాస్తు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా నిధుల సేకరణ రూ. లక్ష కోట్లకు చేరుకుంది.
స్విగ్గీ ఐపీఓ
పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్విగ్గీ ఐపీఓ నవంబర్ 6న ప్రారంభమవుతుంది. ఎనిమిదో తేదీ వరకు కొనసాగుతుంది. కంపెనీ ఐపీఓ ధరను ఒక్కో షేరుకు రూ. 371-–390 మధ్య నిర్ణయించింది. ఐపీఓలో కంపెనీ తన తాజా ఈక్విటీ ఇష్యూ సైజును రూ. 4,499 కోట్లకు పెంచింది. అయితే ఆఫర్ ఫర్ సేల్ భాగాన్ని 17.5 కోట్ల షేర్లకు తగ్గించింది. స్విగ్గీ మునుపటి వాల్యుయేషన్ లక్ష్యం సుమారు 15 బిలియన్ డాలర్లు కాగా, దానిని 11.3 బిలియన్ డాలర్లకు తగ్గించింది. మార్కెట్ అస్థిరత కారణంగా విలువలు తగ్గాయి. విస్తరణ, ప్రచారం కోసం ఐపీఓ నిధులను ఉపయోగించనుంది.
ఆక్మే సోలార్ హోల్డింగ్స్
ఆక్మే సోలార్ హోల్డింగ్ తన ఐపీఓ కోసం రూ. 275–-389 ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 5–8 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 2,395 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు రూ. 505 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఐపీఓ మొత్తం విలువ రూ. 2,900 కోట్లు అవుతుంది. కంపెనీ ఇష్యూ నుంచి వచ్చే నికర ఆదాయాన్ని కొన్ని అప్పులు తీర్చడానికి /ముందస్తు చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనుంది.
సాగిలిటీ ఇండియా
హెల్త్‌కేర్ -ఫోకస్డ్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సాగిలిటీ ఇండియా తన రూ. 2,107 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ను నవంబర్ 5న ప్రారంభించనుంది. ఒక్కో షేరు ధర రూ. 28–-30 మధ్య ఉంటుంది. సబ్స్క్రిప్షన్ఈ నెల ఎనిమిదిన ముగుస్తుంది. ఐపీఓ పూర్తిగా 70.22 కోట్ల షేర్ల ఆఫర్- ఫర్ -సేల్ కావడం వల్ల వచ్చే మొత్తం షేర్‌హోల్డర్‌కు వెళ్తుంది. సాగిలిటీ ఇండియా ఇష్యూ నుంచి నిధులు పొందదు. ప్రాథమిక ఫైలింగ్‌లలో మొదట 98.44 కోట్లు సమీకరిస్తామని ప్రకటించారు కానీ తదనంతరం తగ్గించారు.
నివా బుపా హెల్త్‌కేర్
నివా బూపా హెల్త్‌కేర్ ఐపీఓ నవంబర్ 7న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్అవుతుంది. ఇదే నెల 11 వరకు బిడ్డింగ్‌కు ఉంటుంది. ఇందులో తాజా ఈక్విటీ సేల్ రూ. 800 కోట్లు, రూ. 1400 కోట్ల ఓఎఫ్ఎస్ ఉన్నాయి. ప్రైస్‌బ్యాండ్‌ను త్వరలో ప్రకటిస్తారు. ఓఎఫ్ఎస్ కింద, బుపా సింగపూర్ , ఫెటిల్ టోన్ వాటాలను అమ్ముతాయి. ఫ్రెష్ ఇష్యూ నిధులను సాల్వెన్సీ స్థాయిలను బలోపేతం చేయడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.