కస్టమర్‌ను తప్పుదోవ పట్టించిన స్విగ్గీ.. రూ.25వేల జరిమానా

కస్టమర్‌ను తప్పుదోవ పట్టించిన స్విగ్గీ.. రూ.25వేల జరిమానా

డెలివరీ దూరాలను పెంచి, స్విగ్గీ వన్ సభ్యత్వం కింద చార్జీలు వసూలు చేస్తూ కస్టమర్‌ను తప్పుదోవ పట్టించిన ఆన్‌లైన్ ఫుడ్& గ్రోసరీ డెలివరీ సంస్థ స్విగ్గీకి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం భారీ జరిమానా విధించింది. రూ.25,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

వినియోగదారుడిని మానసికంగా వేధించినందుకుగానూ రూ. 5వేలు, న్యాయపరమైన ఖర్చులకు రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, ఫిర్యాదుదారుడి నుంచి డెలివరీ పార్టనర్ ఫీజుగా వసూలు చేసిన రూ.350.48 (9 శాతం వడ్డీతో) రూ.103 వాపసు ఇవ్వాలని సూచించింది.

ఏంటి ఈ కేసు..?

ఫిర్యాదుదారుడు, బాలానగర్‌లో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మాడి సురేష్ అనే వ్యక్తి సెప్టెంబర్ 27, 2023న స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ సమయంలో 9.7 కిలోమీటర్ల దూరానికి గానూ స్విగ్గీ సంస్థ డెలివరీకి రూ.103 వసూలు చేసింది. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం ఎందుకు అనుకున్న ఆయన.. నిర్ణీత దూరంలోపు ఉచిత డెలివరీ సేవలు పొందడానికి స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేశారు. అనంతరం నవంబర్ 1, 2023న మరోసారి అదే ఆహారాన్ని ఆర్డర్ చేశారు. కానీ ఈసారి స్విగ్గీ సంస్థ తెలివితేటలు ప్రదర్శించింది.

వాస్తవ దూరం 9.7 కిలోమీటర్లు కాగా.. అందుకు బదులుగా దూరాన్ని 14 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా వన్ సభ్యత్వం కింద ఉచిత డెలివరీ ప్రయోజనాన్ని తప్పించుకోవడంతోపాటు కస్టమర్ నుండి డబ్బులు వసూలు చేసింది. దీని గురించి ఆయన స్విగ్గీని సంప్రదించగా.. మొబైల్ GPSని ఉపయోగించి డెలివరీ మార్గాన్ని సవరించవచ్చని వారు తెలివిగా సమాధానమిచ్చారు. ఈ వివరణను నమ్మని సురేష్ బాబు పరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ ఫిర్యాదుపై ఫోరమ్.. నోటీసు అందించినప్పటికీ, స్విగ్గీ స్పందించలేదు. నిర్ణీత వ్యవధిలోగా విచారణకు హాజరుకాలేదు. దాంతో, వినియోగదారుల ఫోరమ్.. కేసు యొక్క వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పిచ్చింది.