న్యూఢిల్లీ: ఫుడ్, గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ సారి కంపెనీ నష్టాలు రూ.799.08 కోట్లకు పెరిగాయి. గత ఏడాది డిసెంబరు క్వార్టర్లో స్విగ్గీకి రూ.574.38 కోట్ల నష్టం వచ్చింది. ఖర్చులు రూ.3,700 కోట్ల నుంచి రూ.4,898.27 కోట్లకు పెరిగాయి.
ఆపరేషన్స్ నుంచి వచ్చే రెవెన్యూ రూ.3,048.69 కోట్ల నుంచి రూ.3,993.06 కోట్లకు పెరిగింది. గ్రాస్ ఆర్డర్ వాల్యూ (జీఓవీ) ఏడాది ప్రాతిపదికన 38 శాతం పెరిగి రూ.12,165 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీ బిజినెస్ జీఓవీ 19.2 శాతం పెరిగి రూ.7,436 కోట్లకు ఎగిసింది. క్విక్‌కామర్స్ జీఓవీ 88 శాతం పెరిగి రూ.3,907 కోట్లకు ఎగిసిందని స్విగ్గీ తెలిపింది.