సింధు, సేన్‌‌ ఫామ్‌‌లోకి వచ్చేనా?

సింధు, సేన్‌‌ ఫామ్‌‌లోకి వచ్చేనా?
  • నేటి నుంచి స్విస్ ఓపెన్ టోర్నమెంట్ 

బాసెల్‌‌: గాయాలు, ఫామ్‌‌ కోల్పోయి డీలాపడ్డ  పీవీ సింధు, లక్ష్యసేన్‌‌ సహా ఇండియా షట్లర్లు మరో సవాల్‌‌కు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే స్విస్ ఓపెన్‌‌లో గెలిచి తిరిగి గాడిలో పడాలని చూస్తున్నారు. ఇటీవల కండరాల గాయం నుంచి కోలుకొని వచ్చిన సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌‌లో తొలి రౌండ్‌‌లోనే ఓటమి పాలైంది. 2022లో స్విస్‌‌ ఓపెన్  టైటిల్ నెగ్గిన సింధు  తొలి రౌండ్‌‌లో ఇండియాకే చెందిన మాళవికతో పోటీపడనుంది. 

విమెన్స్ సింగిల్స్‌‌లో ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ, రక్షిత శ్రీ కూడా బరిలో నిలిచారు. ఆల్‌‌ ఇంగ్లండ్‌‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన లక్ష్యసేన్‌‌ ఈ టోర్నీలో మెరుగైన ఫలితాన్ని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్‌‌లో ఇండియా సీనియర్ షట్లర్‌‌‌‌ హెచ్ఎస్ ప్రణయ్‌‌ను ఎదుర్కోనున్నాడు. ఇతర మ్యాచ్‌‌ల్లో కిరణ్ జార్జ్ తొలి రౌండ్‌‌లో డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కేను, ప్రియాంశు రజావత్ స్విట్జర్లాండ్‌‌కు చెందిన టోబియాస్ క్యూన్జిను ఢీకొట్టనున్నారు. 

మాజీ వరల్డ్ నంబర్ వన్  కిడాంబి శ్రీకాంత్‌‌తో పాటు ఆయుష్ శెట్టి, తరుణ్ మన్నేపల్లి, శంకర్ ముత్తుస్వామి, సతీష్ క్వాలిఫయింగ్ రౌండ్లలో పోటీపడనున్నారు. ఆల్‌‌ ఇంగ్లండ్ టోర్నీ విమెన్స్ డబుల్స్‌‌లో క్వార్టర్స్ చేరిన  పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీపై అంచనాలు ఉన్నాయి. ఈ జంట తొలి మ్యాచ్‌‌లో అలైన్ ముల్లర్– - కెల్లీ వాన్ బ్యూటెన్ (మలేసియా) జోడీని ఎదుర్కొననుంది.