- ఇది ఐదో విడత సమాచారం
- వీటిలో వందలాది అకౌంట్ల వివరాలు
న్యూఢిల్లీ: తమ దేశంలోని బ్యాంకుల్లో డబ్బు దాచిన భారతీయులు, కార్పొరేట్లు, ట్రస్టుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ కేంద్ర ప్రభుత్వానికి పంపింది. యాన్యువల్ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి అందజేసింది. దీని కింద స్విట్జర్లాండ్ దాదాపు 36 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను 104 దేశాలతో పంచుకున్నట్లు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. భారతదేశం, స్విట్జర్లాండ్ మధ్య సమాచార మార్పిడి జరగడం ఇది ఐదవసారి అని తెలిపింది.
కొంతమంది వ్యక్తులు, కార్పొరేట్‌లు, ట్రస్టులకు సంబంధించిన ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. తాజాగా అందిన సమాచారంలో ఖాతాదారుడి పేరు, చిరునామా, నివాస దేశం, పన్ను గుర్తింపు సంఖ్య, ఖాతా ఆర్థిక సమాచారం, రిపోర్టింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఖాతాలోని బ్యాలెన్స్, మూలధన ఆదాయానికి సంబంధించిన సమాచారం ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా ఈ ఖాతాల్లోని మొత్తం వివరాలను అధికారులు వెల్లడించలేదు.
డేటాతో ఎంతో ప్రయోజనం
మనీలాండరింగ్, టెర్రర్ ఫండింగ్‌తో సహా అనుమానిత పన్ను ఎగవేత, బ్లాక్‌మనీ, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. స్విట్జర్లాండ్ గత నెలలో ఈ ఖాతాల వివరాలను ఇండియాకు అందజేసింది. తదుపరి సమాచారాన్ని వచ్చే సెప్టెంబర్‌లో వెల్లడిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులలో అన్ని ఆర్థిక ఖాతాలను వివరాలను వెల్లడించారో లేదో తెలుసుకోవడానికి పన్ను అధికారులు ఈ వివరాలను వాడుకుంటారు.
ఖాతాల వివరాల సమాచారం మార్పిడి గురించి స్విస్ రాజధాని బెర్న్ నుండి ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ)లో భాగంగా104 దేశాలకు ఆర్థిక ఖాతాల సమాచారాన్ని ఇచ్చామని తెలిపింది. ఇది వరకు ఎఫ్‌టీఏ 101 దేశాలకు సమాచారం ఇచ్చేది. ఈ సంవత్సరం ఈ లిస్టులో కజకిస్తాన్, మాల్దీవులు, ఒమన్ దేశాలనూ చేర్చింది. ప్రస్తుత ఏడాది ఆర్థిక ఖాతాల సంఖ్య దాదాపు రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది.