- రూ.24 లక్షల విలువైన 80 కిలోల సరుకు, కారు స్వాధీనం
ఉప్పల్, వెలుగు: ఏపీ నుంచి మహారాష్ట్రకు సిటీ మీదుగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్వోటీ, ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన కుంచల శ్రీను(50) ఇరవై ఏండ్ల కిందట సిటీకి వచ్చి నాగోల్‌లోని బండ్లగూడ ఏరియాలో ఉంటున్నాడు. పాత నేరస్తుడైన శ్రీను గతంలో గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు.
అతడిపై సంగారెడ్డి, రాజమండ్రి, పీలేరు, హయత్ నగర్, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జైలుకెళ్లి వచ్చినా శ్రీను తీరు మారలేదు. ఈజీ మనీ కోసం మళ్లీ గంజాయి అమ్మడం మొదలుపెట్టాడు. ఏపీలోని అనకాపల్లి జిల్లా సోమలింగపాలెంనకు చెందిన కాళ్ల రాము(43)తో కలిసి గంజాయి సప్లయ్ మొదలుపెట్టాడు. ఇందుకోసం బొలెరో వెహికల్‌ను శ్రీను రెంట్ కు తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం శ్రీను, రాము ఇద్దరూ కలిసి వైజాగ్‌లోని పీలేరు నుంచి గంజాయిని తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడ ఎక్కువ రేటుకు సరుకును అమ్మేవారు. ఇటీవల పీలేరు వెళ్లిన వీరిద్దరూ ధన్ రాజ్ అనే వ్యక్తి నుంచి రూ.4,500కు కిలో చొప్పున 80 కిలోల గంజాయిని కొన్నారు.
దాన్ని బొలెరో వెహికల్ లో పెట్టుకుని పీలేరు నుంచి ఈ నెల 16న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్రకు బయలుదేరారు. ఉప్పల్ భగాయత్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరి వెహికల్‌ను ఆపారు. గంజాయిని గుర్తించి శ్రీను, రామును అదుపులోకి తీసుకున్నారు. 80 కిలోల గంజాయి, బొలెరో వెహికల్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి సప్లయర్ ధన్‌రాజ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీను, రామును రిమాండ్‌కు తరలించామన్నారు.