పీడీ యాక్ట్ పెట్టినా గంజాయి అమ్ముడు మానలే .. 8 కిలోల సరుకు స్వాధీనం

పీడీ యాక్ట్ పెట్టినా గంజాయి అమ్ముడు మానలే .. 8 కిలోల సరుకు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: గంజాయి అమ్ముతూ ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లిన ఓ మహిళ.. బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గాంజా అమ్మేది. పీడీ యాక్ట్ పై ఏడాది పాటు జైలులో ఉంచినా ఆమె తీరు మారలేదు. మరోసారి మహిళ ఇంట్లో భారీగా గంజాయి దొరకడంతో ఎస్​వోటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్ రాంగూడ ప్రాంతానికి చెందిన నీతూబాయ్(45) ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్​గా గంజాయి అమ్మేది.

గతంలో పోలీసులకు దొరికి జైలుకెళ్లినా.. ఆమె తీరు మారలేదు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు గతంలో ఆమెపై పీడీ యాక్ట్ పెట్టినా మార్పు రాలేదు.  బుధవారం రాత్రి నీతూబాయ్ ఇంటిపై దాడి చేసిన మాదాపూర్ జోన్ ఎస్​వోటీ పోలీసులు 8 కిలోల గంజాయి, రూ.4 లక్షల 95 వేల క్యాష్​​ను స్వాధీనం చేసుకున్నారు. నీతూబాయ్ తో పాటు ఈ దందాలో ఉన్న సిమ్రాన్, మంతాబాయ్, సురేఖ, మనుసింగ్​ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. నీతూబాయ్​పై 6 కేసులున్నాయని.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్ముతోందని పోలీసులు తెలిపారు.