T20 World Cup 2024: ప్రపంచకప్‌లో జట్టు విఫలం.. నెదర్లాండ్స్ క్రికెటర్ రిటైర్మెంట్

T20 World Cup 2024: ప్రపంచకప్‌లో జట్టు విఫలం.. నెదర్లాండ్స్ క్రికెటర్ రిటైర్మెంట్

నెదర్లాండ్స్ బ్యాటర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ 83 పరుగుల భారీ తేడాతో ఓడిపోయివడంతో ఈ డచ్ బ్యాటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తన చివరి మ్యాచ్ లో సైబ్రాండ్ 9 బంతుల్లో ఒక సిక్సర్ తో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో  సైబ్రాండ్ బౌండరీ దగ్గర తన సూపర్ ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. 

1988లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఎంగెల్‌బ్రెచ్ట్ జన్మించాడు. 35 ఏళ్ల వయసులో 2023లో  నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు. ఈ టోర్నీలో జాంటీ రోడ్స్ తరహాలో క్యాచ్ అందుకొని కోహ్లీని ఔట్ చేయడం విశేషం. ఈ టోర్నీ తర్వాత అతను పూర్తిగా దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యాడు. 2008 నుంచి 2016 వరకు కేప్ కోబ్రాస్‌ జట్టు తరపున ఆడాడు. 

 
ఎంగెల్‌బ్రెచ్ట్ తన యజమాని ఫెయిర్‌ట్రీ కారణంగా 2021లో నెదర్లాండ్స్‌కు వచ్చాడు. ఇక్కడ క్రికెట్ ఆడి 2023నెదర్లాండ్స్ జట్టులో స్థానం సంపాదించాడు. 2023 లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 37.50 సగటుతో 300 పరుగులు చేసి నెదర్లాండ్స్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటివరకు నెదర్లాండ్స్ తరపున 12 వన్డేల్లో 35 యావరేజ్ తో 385 పరుగులు చేశాడు. 12 టీ20ల్లో 31 యావరేజ్ తో 280 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో 24.5 సగటుతో 98 పరుగులు చేసి.. నెదర్లాండ్స్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.