ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ పేసర్ దౌర్జన్యం.. 4 మ్యాచ్‌ల నిషేధం

ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ పేసర్ దౌర్జన్యం.. 4 మ్యాచ్‌ల నిషేధం

ఇంగ్లాండ్ పేస్ బౌలర్ టామ్ కరణ్ పై క్రికెట్ ఆస్ట్రేలియా కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బిగ్ బాష్ లీగ్ లో నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించింది. 28 ఏళ్ళ ఇంగ్లాండ్ పేసర్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్లు తరపున ఆడుతన్నాడు.  పిచ్ మీద పరిగెడుతూ వార్మప్ చేయడంతో కరణ్ ను బ్యాన్ చేశారు. రిఫరీ చెప్పినా వినకపోవడంతో కరణ్ పై చర్యలు తీసుకున్నారు.

డిసెంబరు 11న లాన్సెస్టన్‌లో హోబర్ట్ హరికేన్స్‌తో సిక్సర్స్ తో మ్యాచ్‌కు ముందు రిఫరీతో కరణ్ వాగ్వాదం జరిగింది. పిచ్‌పైకి పరుగెత్తవద్దని రిఫరీ సూచించినా.. ఈ ఇంగ్లీష్ పేసర్ ప్రాక్టీస్ లో తన పరుగును పూర్తి చేసాడని.. క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. BBL13 ఆర్టికల్ 6.3 ప్రకారం.. ఆట ప్రారంభానికి ముందు పిచ్ పరిస్థితిని అంచనా వేయడానికి కెప్టెన్, జట్టు కోచ్ మాత్రమే మైదానంలోకి ప్రవేశించవచ్చు.

ఈ నిషేధంతో కరణ్ తదుపరి నాలుగు మ్యాచ్ లను మిస్ కానున్నాడు. ఇందులో భాగంగా రేపు( డిసెంబర్ 22) అడిలైడ్ తో మ్యాచ్ తో పాటు డిసెంబర్ 26, 30, జనవరి 1 న వరుసగా మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ తో మ్యాచ్ లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉండగా ఇటీవలే టామ్ కరణ్ ను ఐపీఎల్  మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి 50 లక్షలకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆల్ రౌండర్ స్లో బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంతో పాటు భారీ షాట్స్ ఆడగల సామర్ధ్యం ఉంది.