‘సైరా’ బయోపిక్​ కాదు

‘సైరా’ బయోపిక్​ కాదు
  •                 హైకోర్టుకు తెలిపిన సినిమా టీం
  •                 విచారణ 30కి వాయిదా

‘సైరా’ చిత్రానికి సెన్సార్‌‌ బోర్డు ఇంకా సర్టిఫికెట్​ జారీ చేయలేదు కాబట్టి ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. చిత్ర నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 20 కోట్లు రాయల్టీ ఇవ్వాలని కోరడం సివిల్‌‌ వివాదం అవుతుందని, దీనిపై రిట్‌‌ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్​ తరఫు లాయర్​ను ప్రశ్నించింది. సైరా సినిమాకు సంబంధించి వాదనలు గురువారం కూడా కొనసాగాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదుల జాబితా నుంచి బిగ్‌‌ బి అమితాబ్‌‌ బచ్చన్‌‌ పేరును తొలగించడంతో జడ్జి జస్టిస్‌‌ అభినంద్‌‌ కుమార్‌‌ షావిలి ముందు విచారణ కొనసాగింది. ఈ సినిమాకు ఇంకా సెన్సార్​ సర్టిఫికెట్​ ఇవ్వలేదని సెన్సార్​ బోర్డు తరఫు లాయర్​ తెలిపారు. సోమవారం వరకు దీనిపై బోర్డు నిర్ణయం చెబుతామని కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు సైరా సినిమా బయోపిక్‌‌ కాదని చిత్ర బృందం తరఫు లాయర్​ తెలిపారు. తమ వాదనలకు కూడా సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు లాయర్​ కోరారు. రూ.20 కోట్లు రాయల్టీగా ఇవ్వకుండా, ప్రివ్యూ చూపించకుండా సినిమాను విడుదల చేయరాదని కోరుతూ నర్సింహారెడ్డి వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి మరో నలుగురు పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ సోమవారానికి వాయిదా పడింది.

తప్పుదోవ పట్టిస్తున్నారు: కేతిరెడ్డి

సైరా చిత్ర కథను ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ కాదంటూ సినిమా టీం కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్​రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని మీడియాకు తెలిపారు. నర్సింహారెడ్డి జీవితాన్నే సినిమాగా తీస్తున్నట్లు వారసులకు చెప్పి చిరంజీవి, రాంచరణ్​ అగ్రిమెంట్​ చేసుకున్నారన్నారు.