నేడే ముస్తాక్ అలీ ఫైనల్ మ్యాచ్‌‌..ముంబై x మధ్యప్రదేశ్‌‌

నేడే ముస్తాక్ అలీ ఫైనల్ మ్యాచ్‌‌..ముంబై x మధ్యప్రదేశ్‌‌
  •     నేడే ముస్తాక్ అలీ ఫైనల్ మ్యాచ్‌‌
  •     సా. 4.30 నుంచి స్పోర్ట్స్‌‌18లో

బెంగళూరు : హోరాహోరీ పోరాటాలతో అభిమానులను అలరిస్తున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌లో ఆఖరాటకు వేళయింది. సూపర్ ఫామ్‌‌లో ఉన్న ముంబై, ఆల్‌‌రౌండ్‌‌తో ఆకట్టుకుంటున్న మధ్యప్రదేశ్‌‌ ఆదివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. స్టార్ ప్లేయర్లు, ప్రస్తుత ఫామ్‌‌ చూస్తే ఈ మ్యాచ్‌‌లో ముంబైనే ఫేవరెట్‌‌. ఆ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది. టోర్నీలో అనూహ్యంగా రెచ్చిపోతున్న వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానెతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌, పృథ్వీ షా, శివం దూబే వంటి మేటి టీ20 ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు.  

టీమిండియాకు దూరమైన రహానె ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌‌ల్లో ఐదు ఫిఫ్టీలు సహా 432 రన్స్‌‌తో టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచాడు.  ఓపెనర్‌‌‌‌గా రహానె  170 స్ట్రయిక్ రేట్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. వన్‌‌డౌన్‌‌లో శ్రేయస్ నిలకడగా ఆడుతున్నాడు.  బౌలింగ్‌‌లోనే ముంబైకి సమస్యలు ఉన్నాయి. పేసర్లు మోహిత్ అవస్తి, శార్దూల్ ఠాకూర్‌‌‌‌, దూబే అంతగా ఆకట్టుకోవడం లేదు. స్పిన్నర్లు తనుష్ కోటియన్, సూర్యాన్ష్‌‌, అథర్వ అంకోలేకర్ మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు.  

మరోవైపు  టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న ఎంపీ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. కెప్టెన్ రజత్ పటీదార్ (347 రన్స్‌‌) జోరు మీదున్నాడు. ఐపీఎల్‌‌లో రూ. 23.75 కోట్లు పలికిన బ్యాటింగ్ ఆల్‌‌రౌండర్‌‌‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్ ఆ టీమ్‌‌లో కీలకంగా ఉన్నాడు. పేసర్లు అవేశ్‌‌ ఖాన్‌‌, త్రిపురేష్‌‌, స్పిన్నర్‌‌‌‌ కుమార్ కార్తికేయ ఫైనల్లో కీలకం కానున్నారు.