బెంగళూరు: బ్యాటింగ్‌లో రాణించిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని రెండోసారి సాధించింది. భారీ టార్గెట్ ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (48), అజింక్యా రహానె (37), సూర్యాన్ష్ షెడ్జే (36 నాటౌట్) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై గెలిచింది. దీంతో 2022–23లో సాధించిన టైటిల్‌ను మళ్లీ నిలబెట్టుకుంది. టాస్ ఓడిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. రజత్ పటీదార్ (81) భారీ స్కోరుతో రెచ్చిపోయినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు.
శుభ్రాంష్ సేనాపతి (23), రాహుల్ బాథమ్ (19), వెంకటేశ్ అయ్యర్ (17)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్, రోస్టన్ డియాస్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ముంబై 17.5 ఓవర్లలో 180/5 స్కోరు చేసి నెగ్గింది. పృథ్వీ షా (10), శ్రేయస్ అయ్యర్ (16) నిరాశపర్చినా.. రహానె, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 52 రన్స్ జోడించారు. శివమ్ దూబే (9) ఫెయిలయ్యాడు. చివర్లో అథర్వ (16 నాటౌట్), సూర్యాన్ష్ విజయానికి కావాల్సిన రన్స్ జోడించారు. త్రిపురేష్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సూర్యాన్ష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రహానెకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.