బెంగళూరు : టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (17 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్, 1/25) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ రాణించి తన టీమ్ బెంగాల్‌ను క్వార్టర్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 3 రన్స్ తేడాతో చండీగఢ్‌ను ఓడించింది. తొలుత బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 159/9 స్కోరు చేసింది.
పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ భారీ షాట్లతో అలరించాడు. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్లో 19 రన్స్ రాబట్టాడు. సయన్ ఘోష్ (1 నాటౌట్)తో చివరి వికెట్‌కు 10 బాల్స్‌లోనే 21 రన్స్ జోడించాడు. అనంతరం ఛేజింగ్‌లో చండీగఢ్ ఓవర్లన్నీ ఆడి 156/9 స్కోరు చేసి ఓడింది. బెంగాల్ బౌలర్ సయన్ ఘోష్ నాలుగు వికెట్లు పడగ్గొట్టాడు. మరో మ్యాచ్‌లో యూపీ 4 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించి క్వార్టర్స్ చేరింది.
టెస్టులకు ఫిట్‌గా ఉన్నాడా?
ఈ టోర్నీలో 16 రోజుల్లో ఎనిమిదో మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన షమీ అన్నింటిలోనూ తన నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేశాడు. కానీ, టెస్టు మ్యాచ్ ఆడేందుకు తానింకా సిద్ధంగా లేనని షమీనే ఎన్‌సీఏ మెడికల్ టీమ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. తర్వాత మోకాలులో వాపు వస్తోందని ఎన్‌సీఏ ఫిజియోలకు చెబుతున్నాడు.
ఇదే విషయాన్ని ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు తర్వాత రోహిత్ శర్మ మీడియాతో తెలిపాడు. ఈ లెక్కన షమీ ఆసీస్‌తో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. చివరి రెండు టెస్టులకు అయినా ఫిట్‌నెస్ సాధిస్తాడేమో చూడాలి.